అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై యువతకు శిక్షణ - iiit
యువతలో నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యోగం సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు.
కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు జరిగే శిక్షణలో విద్యార్థులకు ఇంజనీరింగ్ నైపుణ్యాలను నేర్పించనున్నారు. 210 మంది ఏపీఎస్ఎస్డీసీ ట్రైనీలు, 31 మంది ఆర్జేకేయూటీ నూజివీడు విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నూజివీడు ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ జేఎస్వీ ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సార్థకం అవ్వాలంటే ప్రతి విద్యార్థి ఆలోచనా తీరు, ప్రవర్తనలో మార్పులు రావాలని అన్నారు. ఆర్జేకేయూటీ ప్రాంగణాల ఉపకులపతి ఆచార్య రామచంద్రరాజు, ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి పాల్గొన్నారు.