విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నందిగామ, కంచికచర్ల వద్ద బైపాస్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇక్కడ వాహనాలను అనధికారికంగా అనుమతిస్తున్నారు. హైదరాబాద్ జాతీయ రహదారిలో 14.34 కిలోమీటర్ల మేర ఆరు వరసల రహదారి పూర్తయింది. హైదరాబాద్ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించిన సమయంలో నందిగామ, కంచికచర్లలో బైపాస్ నిర్మించలేదు. హైదరాబాద్ వైపు వెళ్లే సమయంలో జాతీయ రహదారి రెండు వరుసలుగా ఉండేది. విజయవాడ వైపు వచ్చేటప్పుడు నందిగామ, కంచికచర్ల పట్టణాల మీదుగా రావాల్సి వచ్చేది.ఈ రహదారికి ఇరువైపులా స్థానిక వాహనాల రాకపోకలు సాగేవి. ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ట్రాఫిక్‌కూ అంతరాయం ఏర్పడేది. నాడు నిధులు సరిపోవని, పట్టణాల మీదుగా రాకపోకలు సాగించాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ తర్వాత అదే అవస్థలు తెచ్చిపెట్టింది. దీంతో మళ్లీ జాతీయ రహదారుల సంస్థకు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో 2017-18లో ఈ రెండు పట్టణాలకు బైపాస్ రహదారులు (జాతీయ రహదారి విస్తరణ) మంజూరు చేశారు.
1.2 కి.మీ మినహా..!
ఇప్పటివరకు నందిగామ, కంచికచర్ల పట్టణాల వద్ద జాతీయ రహదారి విస్తరణ 1.20 కిలోమీటర్లు మినహా మొత్తం పూర్తయింది. ఈ బైపాస్ రోడ్డు మీదుగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక నందిగామ, కంచికచర్ల పట్టణాల లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. నందిగామ పట్టణంలోకి వేళ్లేందుకు తూర్పువైపు రెండు, పడమర వైపు రెండు అండర్‌పాస్‌లు, కంచికరచర్ల వద్ద తూర్పు వైపు రెండు, పడమర వైపు రెండు అండర్‌పాస్‌లు నిర్మాణం పూర్తయ్యాయి.