BHADRADRI VEDUKALU: భద్రాద్రిలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో మొదటిది సీతారాముల కల్యాణం కాగా.. రెండోది ముక్కోటి వేడుక. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు పేరిట ఈ నెల 23న మొదలైన వేడుకలు... జనవరి 2 వరకు ఆద్యంతం వైభవోపేతంగా జరగనున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా సర్వలోకాలను ఏలే జగదభిరాముడు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తూ... భక్తులను పరవశింపజేస్తున్నారు.
ప్రతిరోజూ ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్రకూట మండపం వద్ద భక్తులకు దర్సనమిస్తున్నారు. రోజు స్వామి వారికి ధనుర్మాస పూజల్లో భాగంగా బేడా మండపంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఆలయం వద్ద నుంచి పవిత్ర గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి అక్కడి నుంచి మిథిలా స్టేడియం వద్దకు వెళ్లి.... అక్కడ వేచి ఉన్న భక్తులకు రాముల వారు దర్శనమిస్తున్నారు. ఇప్పటివరకు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నర్సింహావతారం, వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారంలో దర్శనమిచ్చిన రాములోరిని దర్శించుకుని భక్తజనం పులకించిపోయింది.
శుక్రవారం బలరామావతారంలో భక్తులకు రాములవారు దర్శనమిచ్చారు. నేడు కృష్టావతారంలో దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జనవరి 1న సాయంత్రం గోదావరి తీరంలో నిర్వహించే తెప్పోత్సవం వేడుకతో పాటు జనవరి 2న తెల్లవారుజామున జరగనున్న ఉత్తరద్వార దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ వేడుకలను భక్తుల మధ్య వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు.