వైద్యానికి డబ్బులు లేక ఆసుపత్రి చెట్టు కింద దిక్కుతోచని స్థితిలో కూర్చున్న 90 ఏళ్ల అవ్వకు.. పోలీసులు వైద్యం చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు. విజయవాడ జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నవరసమ్మ అనే 90 ఏళ్ల ముసలవ్వ.. ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడి.. వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆమెను విజయవాడ వెళ్లాలని చెప్పారు. డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆసుపత్రి ప్రాంగణంలో ఓ చెట్టు కింద కూర్చుంది.
అదే సమయంలో రూరల్ ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్ రామాంజనేయులు వృద్ధురాలిని గమనించి ఆరాతీశారు. తనకు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవని చెప్పడంతో చలించిన ఎస్‌ఐ.. వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి, ఇంటికి పంపారు. తనను ఆదుకున్న పోలీసులను చల్లగా ఉండాలని వృద్ధురాలు దీవించింది.