హిందూ ధర్మం ఏ మతానికో చెందింది కాదని, అది భారతీయ జీవన విధానమని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మ ప్రచార యాత్ర ముగింపు సందర్భంగా.. దళితులు, గిరిజనులతో కలిసి తిరుమలేశుని దర్శనానికి వెళ్లేందుకు సిద్దమవుతున్న ఆయన.. విజయవాడలో యాత్రీకులతో కలిసి సంకీర్తనలు ఆలపించారు.
సీవీ రెడ్డి ఛారిటీస్లో బస చేసిన ఆయన యాత్రీకులను కుశల ప్రశ్నలు అడిగారు. బుధవారం ఉదయం దళితులు, గిరిజనులతో కలిసి తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలేశుని దర్శనం కోసం యాత్రీకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని, ఆ ఉత్సాహం వారి కళ్లల్లో కనబడుతోందని చెప్పారు.