Show Cause Notices to Komatireddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారి భాజపాలో చేరి మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారడంతో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా కల్పించే నాయకుడు లేకుండా పోయింది. దీంతో కోమటిరెడ్డి సోదరుల అభిమానులు, అనుచరులు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతున్నారు. ఎవరి తరఫున ప్రచారం చేయాలో తెలియక వెంకట్‌రెడ్డి అయోమయంలో పడ్డారు. తన సోదరుడు పార్టీ వీడినప్పటి నుంచి వెంకట్‌రెడ్డి తరచూ పార్టీని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై విమర్శలు చేశారు.
ఆడియో వైరల్: మరోవైపు తరచూ కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసి భాజపా అభ్యర్థి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆధారాలేం లేకపోవడంతో ఏఐసీసీ నాయకత్వం వేచి చూసింది. రెండ్రోజుల కిందట మునుగోడుకు చెందిన జబ్బార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి తన తమ్ముడికి ఓటు వేయాలని సూచించారు. ఇదే ఆడియో బయటకు వచ్చి వైరల్ అయ్యింది. ఆ మరుసటి రోజు వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన మరోసారి మునుగోడులో కాంగ్రెస్‌ను బలహీన పరిచేలా చేసింది.