అంజని లఘుచిత్రం.. అఘాయిత్యాలపై పోరాటం! - short films
పుట్టింట్లో అయినా.. అత్తింట్లోనైనా... బడిలో అయినా.. ఇంకెక్కడైనా... సమాజంలో ఎక్కడ చూసినా.. మహిళ అంటే వివక్షగా చూసే వారే ఎక్కువ. వారి రక్షణకు ఎక్కడా భరోసా ఉండదు. కఠిన చట్టాలు హెచ్చరిస్తున్నా... సమాజంలో అమానుష కృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ ఘటనతో ఉలిక్కి పడిన దేశం.. ఆ తర్వతా అంతకుమించిన ఘటనలతో ఆవేదనకు గురవుతోంది. ఆ కలవరపాటే ఓ సాధారణ మహిళను సందేశాత్మక లఘుచిత్రాల వైపు నడిపించింది.
అంజని లఘుచిత్రం.. అఘాయిత్యాలపై పోరాటం!
పుస్తకాలు మోసుకుంటూ బంగారు భవిష్యత్తు కోసం బడికెళ్లే ఆడపిల్ల ఇంటికి తిరిగొస్తుందో లేదో తెలియని భయంకర పరిస్థితులు ఇప్పుడు దేశంలో కొనసాగుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నా, వీధిలోకి ఒంటరిగా వెళ్లినా, బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నా.. ఎక్కడా ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితి. ఈ విషయంపైనే.. మన తెలుగమ్మాయి, విజయవాడకు చెందిన అంజని.. ఆవేదన చెందారు. సమాజాన్ని జాగృతం చేసేందుకు సందేశాత్మక చిత్రాలను ఆయుధంగా చేసుకున్నారు.
బాలికలు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై సమాజాన్ని మేల్కొలిపేందుకు తనవంతుగా ముందుకొచ్చారు అంజని. తారాగణంలో కానీ, చిత్రీకరణలో కానీ రాజీపడకుండా నెటిజన్లను ఆకట్టుకునే విధంగా లఘుచిత్రాలను రూపొందిస్తున్నారు. వరద గుడి, అరుంధతి లాంటి లఘుచిత్రాలు.. నెటిజన్ల నుంచి అపూర్వ ఆదరణ పొందాయి. లక్షా 50వేలకు పైగానే నెటిజన్లు ఆమె లఘుచిత్రాలను వీక్షిస్తూ ఉంటారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మార్పు తీసుకురావాలనే చిన్న ప్రయత్నమే ఈ దిశగా తనను నడిపిస్తోందని ఆమె చెబుతారు.
ఏవీఎం బ్యానర్ అంటే?
ఏవీఎం పేరుతో బ్యానర్ రిజిస్టర్ చేయించి లఘుచిత్రాల నిర్మాణం, దర్శకత్వం వహిస్తున్నారు అంజలి. అయితే ఈ ఏవీఎం వెనుక చిన్న కథ ఉంది... ఏ అంటే అంజని.... వీ అంటే విజయ.... ఈమె అంజని సోదరి. ఇక ఎం అంటే మహిత... ఈమె అంజని కుమార్తె. కథ అనుకున్నాక అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, సంభాషణలు, స్క్రీన్ ప్లే అంజని చూసుకుంటుంది. చిత్ర నిర్మాణానికి సంబంధించిన సాంకేతికతను విజయ అందిస్తుంది. పూణేలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి జర్మన్ ట్రాన్స్ లేటర్ గా పనిచేస్తున్న మహిత... తల్లి తీసే చిత్రాలకు ఆర్థికంగా వెన్నుదన్ను అందిస్తుంది.
ప్రభుత్వం నుంచి పిలుపు
ఈ చిత్రాలను చూసిన స్త్రీ, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్.... మహిళల్లో చైతన్యం కలిగించడంతో పాటు బాలికలపై జరుగుతున్న అకృత్యాలను నివారించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించేలా చిత్రాలు నిర్మించాలని అంజనిని కోరారు. అలా ప్రభుత్వ పిలుపు మేరకు ప్రస్తుతం బాలికలు, స్త్రీ సమస్యలపై చిత్రాలు నిర్మించి ఇవ్వడంతో పాటు.... మౌనమూ నేరమే.. పేరుతో పోస్టర్లు సైతం ముద్రించి సమాజంలో అవగాహన కల్పిస్తున్నారు.