ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దశాబ్దాల ఆచారం...బందరు శక్తిపటాల ఉత్సవం - ప్రాంతాలవారీగా దసరా వేడుకలు

బందరు అంటే ముందుగా గుర్తుకువచ్చేది.. ఓడరేవు. అయితే దసరా ఉత్సవాల సందర్భంగా దశాబ్దాలుగా అక్కడ ఓ ఆచారం కొనసాగుతోంది. వందేళ్లు గడిచినా ఇప్పటికీ బందరు వాసులు భక్తి శ్రద్ధలతో ఆచారాన్ని తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఆ ఆచారాన్ని పాటిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని వారి ప్రగాఢ నమ్మకం. అసలేంటా ఆచారం... ఎందుకంత నమ్మకం. అయితే ఈ కథనం చదవాల్సిందే.

దశాబ్దాల ఆచారం...బందరు శక్తిపటాల ఉత్సవం

By

Published : Oct 8, 2019, 6:20 AM IST

దశాబ్దాల ఆచారం...బందరు శక్తిపటాల ఉత్సవం
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం దసరా శక్తిపటాలకు పెట్టింది పేరు. బెడవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలు తరవాత అంత పెద్దఎత్తున దసరా వేడుకలు బందరులో నిర్వహిస్తారు. శక్తిపటాల ఊరేగింపు విషయానికి వస్తే కోల్‌కతా తర్వాత అంతస్థాయిలో నిర్వహించేది కూడా మచిలీపట్నంలోనే. ఈ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు దాదాసింగ్ దశాబ్దాల క్రితం కోల్​కతాలోని కాళీకామాత చిత్రపటాన్ని ఈడేపల్లిలో ప్రతిష్ఠించి పూజలు చేశారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. శక్తిపటాల ప్రదర్శనను మచిలీపట్నానికి పరిచయం చేసింది ఆయనే.

దుర్గామాత ఆవహిస్తోందని ప్రతీతి

పండగ రోజుల్లో మనిషికి శక్తివేషం వేసి వెదురు కర్రలతో తయారుచేసిన దుర్గామాత శక్తి పటానికి కాగితాలు అంటించి దుర్గామాత బొమ్మవేసి రంగులు అద్ది, అతని వీపునకు కడతారు. శక్తిపటాలు కట్టుకున్న వ్యక్తి పురవీధుల్లో ఊరేగుతుండగా డప్పుమోతలతో నృత్యం చేస్తూ భక్తులు అతనిని అనుసరిస్తుంటారు. శక్తిపటం కట్టుకున్న వ్యక్తిని దుర్గామాత ఆవహిస్తుందని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. అలా ఊరేగుతున్న శక్తిపటాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నల్లని దుస్తులతో ఒక చేతిలో చురకత్తి, రెండో చేతిలో ఆరడగుల శక్తిపటాన్ని భుజానకెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తిభావాలను చాటుతుంది. ఒక వైపు ఆంజనేయస్వామి మరోవైపు కాళికామాత చిత్రాలను మనోహరంగా రూపొందించిన పటం చూపరులకు కనువిందు చేస్తుంది.


సకుటుంబ సపరివారంగా వీక్షణం

గతంలో మచిలీపట్నంలోని శక్తిగుడి, గొడుగుపేట గాయత్రిమాత ఆలయం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరిగేవి. ఇప్పుడు ఇతర ప్రాంతాలనుంచి వచ్చే భక్తులు శక్తిపటాలు ఎత్తుకుంటున్నారు. రుద్రభూమిలో తెల్లవారు జామున పూజలు చేసి శక్తిపటాన్ని ఎత్తుకునే వ్యక్తి ఉపవాస దీక్షను స్వీకరిస్తారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు వారి బంధువులు, భక్తులు అధికసంఖ్యలో పట్టణానికి తరలివస్తుంటారు.

కోనేరు సెంటర్​లో ప్రత్యేక ప్రదర్శన

ముఖానికి కాళికామాత ముఖచిత్రాన్ని కరాళంగా ధరిస్తారు. ఉదయం ఉపవాస దీక్షతో మొదలయ్యే ప్రదర్శన సాయంత్రం వరకూ కొనసాగుతుంది. శక్తిపటాన్ని ధరించడం వలన కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం. విజయదశమి నాటి రాత్రి ఆయా ప్రాంతాలనుంచి శక్తిపటాలు ఊరేగింపుగా బయలుదేరి కోనేరు సెంటర్​లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తారు. తెల్లవారుజాము వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. శక్తిపటాలు కోనేరు సెంటర్​కు చేరుకోవడంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి.

ఇదీ చదవండి :

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

ABOUT THE AUTHOR

...view details