విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహనరావు (80) గుండెపోటుతో మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్మోహనరావు.. కొంతకాలంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామ్మోహనరావు భౌతికకాయాన్ని ప్రస్తుతం సూర్యారావుపేటలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు (సోమవారం) అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎంపీ కేశినేని నాని, రాష్ట్ర బార్‌కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, బార్‌కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, చలసాని అజయ్‌కుమార్, ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావు, తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ, చేకూరి శ్రీపతిరావు, బెనర్జీ తదితరులు కర్నాటికి నివాళులర్పించారు.
క్రిమినల్ కేసుల వాదనలో దిట్ట..
కర్నాటి రామ్మోహనరావు 1967 జులై 4న రాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. అనంతరం విజయవాడలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ క్రమంలో.. అనేక సంచలనాత్మక కేసులను వాదించారు. క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్టగా పేరుగాంచారు. ఉరిశిక్షలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. వంగవీటి మోహనరంగా, దేవినేని నెహ్రూ ఇరు వర్గాల కేసులను వాదించారు.