కృష్ణా జిల్లాలో 60 ఏళ్లు దాటిన వారు ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కొవిడ్ టీకాను కేవలం 23వేల మంది మాత్రమే వేయించుకున్నారు. జిల్లాలో కొవిడ్ టీకాను 146 ప్రభుత్వ, 44 ప్రైవేటు వైద్య కేంద్రాల్లో వేస్తున్నారు. రోజుకు కనీసం పది నుంచి 20వేల మందికి టీకాలను వేయాలని ఏర్పాట్లు చేశారు. 60ఏళ్లు దాటిన సాధారణ పౌరులకు మార్చి నెల ఆరంభం నుంచి కొవిడ్ టీకాను వేస్తున్నారు. ఇప్పటికి 20 రోజులు గడుస్తోంది. టీకాపై ఏర్పడిన అపోహల నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన వయోపౌరులు ముందుకు రావడం లేదు. జిల్లాలో వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో వందేళ్లు దాటినోళ్లు కూడా ఉన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురుకావనే విషయంపై జిల్లా యంత్రాంగం మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు 1,32,510 మంది కొవిడ్ వాక్సిన్‌ను వేయించుకున్నారు. వీరిలో మొదటి, రెండు దశల్లో టీకా వేసుకున్న ఆరోగ్య, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది అధికంగా ఉన్నారు. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల మంది వరకు టీకా వేయించుకునేందుకు వస్తున్నారు. వీరిలో రెండో విడత టీకా కోసం వస్తున్న ఆరోగ్య, ఇతర సిబ్బందే అధికంగా ఉంటున్నారు. 60 ఏళ్లు దాటిన వాళ్లు చాలా తక్కువ మందే వస్తున్నారు. వీరు శుక్రవారం ఉదయం వరకు 23,185మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకా వేసుకున్నాక.. వీరెవరికీ ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు.