Secunderabad Railway Station: దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌లోని రైల్వేస్టేషన్ ఇక విమానాశ్రయాన్ని తలపించేలా.. అంతర్జాతీయ ప్రమాణాలు, వసతులతో అత్యాధునికంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకుగాను రూ.726 కోట్లతో పనులు చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఈమేరకు రైల్వేశాఖ టెండర్లు పిలవగా 8 సంస్థలు పోటీపడ్డాయి. దిల్లీకి చెందిన గిరిధర్‌లాల్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పనులను దక్కించుకుంది.
36 నెలల్లో పనులను పూర్తిచేయాలని రైల్వే అధికారులు ఆ సంస్థకు స్పష్టం చేశారు. దేశంలోనే ప్రధానమైన రైల్వేస్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్ గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి నిత్యం సగటున 200 రైళ్లను నడుపుతున్నారూ.1.80 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. నాన్ సబర్బన్ గ్రేడ్-1 విభాగంలో ఈ స్టేషన్ ఉంది. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆధునిక సౌకర్యాలు కల్పించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక రూపొందించింది. స్టేషన్‌ని ఏవిధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై దక్షిణ మధ్య రైల్వే నమూనా డిజైన్లు ఇచ్చింది.
అందుబాటులోకి వచ్చే వసతులివే..
* రైల్వేస్టేషన్‌కు ఉత్తరం వైపు 5 అంతస్తుల్లో మల్టీలెవల్ పార్కింగ్. దక్షిణదిశలో భూగర్భ పార్కింగ్.
* ఉత్తర (22,516 చదరపు మీటర్లు), దక్షిణ (14,792 చ.మీ.లు) దిశల్లో ‘జీ+3’ అంతస్తులతో భవనాలు.
* 108 మీటర్ల ఎత్తుతో రెండంతస్తుల ‘స్కై కాన్‌కోర్స్’ నిర్మాణం. మొదటి అంతస్తును ప్రయాణికుల కోసం.. రెండోది ఫ్లోర్ రూప్‌టాప్ ప్లాజాగాను రూపొందిస్తారు.