నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదవీ విరమణ చేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా తనకు ప్రజలు, మీడియా నుంచి అపూర్వ సహకారం అందిందని వెల్లడించారు. రీపోలింగ్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని ఎస్‌ఈసీ వివరించారు. ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహకారం లభించినట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు. కొంతమంది అనాగరిక చర్యలు వ్యవస్థపై ప్రభావం చూపాయన్నారు. ఎవరో ఒకరు చేసే అనాగరిక చర్యల వల్ల వ్యవస్థపై ప్రభావం చూపిందన్న నిమ్మగడ్డ.. సిబ్బంది మూకుమ్మడి సెలవుపై పంపించే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని చెప్పుకొచ్చారు.
హైకోర్టు సహకారం..
తమ బాధ్యతల నిర్వహణలో హైకోర్టు సంపూర్ణ సహకారం అందించిందన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కమిషనర్ రమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మంచి పద్ధతి అమలులో ఉందని ఈ సందర్భంగా ఎస్‌ఈసీ తెలిపారు.
సీఎస్, డీజీపీకి ప్రశంసల జల్లు..
సీఎస, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని నిమ్మగడ్డ ప్రసంశించారు. అన్ని వ్యవస్థలు, అందరి సహకారం వల్లే ఎన్నికలను సజావుగా నిర్వహించగలిగానన్నారు. ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం, తోడ్పాటు ఉన్నప్పుడే మెరుగైన పనితీరు వస్తుందన్నారు.