తొలి దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్లైన్ ద్వారా స్వీకరించకపోవడంపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారుల మీద... ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నామినేషన్లు తీసుకోవాలని తాను ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై.. నిన్న ఎస్ఈసీ ఇచ్చిన నోటీసుకు సంజాయిషీ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది.. ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను కలిశారు.
తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై.. గంటపాటు జరిగిన సమావేశంలో ఎస్ఈసీ కారణాలు తెలుసుకున్నారు. పంచాయతీ రాజ్ అధికారులు ఇచ్చిన సమాధానంపై... ఎస్ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెండో దఫా నామినేషన్ల ప్రారంభం నాటికి ఆన్లైన్లో ప్రక్రియ ప్రారంభించాలని నిమ్మగడ్డ ఆదేశించినట్లు సమాచారం.