తన ఖాతాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సొమ్ము తనది కాకపోయినా జమకావడంతో కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసి విచారణ కోరితే తనపైనే అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని నెల్లూరు జిల్లాకు చెందిన రైతు జైపాల్ ఆవేదన వ్య్వక్తం చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనకు రావాల్సిన సొమ్ముకంటే అధికంగా ఎందుకు వచ్చిందని ప్రశ్నించడంలో తాను చేసిన తప్పేంటని.. ప్రశ్నించారు.
'రావాల్సిన సొమ్ముకంటే అధికంగా ఎందుకు వచ్చిందని అడిగితే తప్పా.?' - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
ధాన్యం కొనుగోలుకు సంబంధించి తన ఖాతాలో అసలు కంటే ఎక్కువ డబ్బులు జమకావడంతో ఓ రైతు పోలీసులకు , అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసి విచారణ కోరితే తనపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఎస్సీ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు దుర్భాషలాడుతూ తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని.. తన ఖాతాలో జమ ఐన సొమ్ముపై విచారణ జరిపించాలని కోరారు. వైకాపా ప్రభుత్వంలో దళారుల విచ్చలవిడితనం పెరిగిపోయిందని ఆరోపించారు. వెనుకబడిన వర్గాల రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి.. వారి ఆధార్ నెంబర్లపైనే ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని తెదేపా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆరోపించారు. జైపాల్‌కు జరిగిన అన్యాయంపై విచారణ చేయించాలని.. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయం జరిగేవరకు జైపాల్‌కు తెదేపాఅండగా ఉంటుందన్నారు.