కడప జిల్లా రాయచోటిలో కనుమను వైభవంగా చేసుకున్నారు. రైతులు పశువుల్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఊరి శివారు కాటమరాజు గుడి వద్ద ప్రసాదాలు వండి పూజలు చేశారు. ఆలయ సమీపంలో వేసిన చిట్లా కుప్పలకు శాస్త్రోక్తంగా నిప్పంటించారు. పశువుల్ని కుప్పల వద్దకు తీసుకొచ్చి పరుగలు పెట్టించారు. వాటికి అలంకరించిన డబ్బు నోట్లను తీసుకునేందుకు యువకులు పోటీపడ్డారు. చిట్లా కుప్పల్లో గుమ్మడికాయులు, కొబ్బరిచిప్పలు వేసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ మొత్తం తంతును చూసేందుకు వచ్చినవారితో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. బద్వేలులో గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గొబ్బెమ్మను ఊరేగించి మహిళలు గొబ్బి పాటలు పాడారు.
కనుమ పండుగ సందర్భంగా నెల్లూరులో తెప్పోత్సవం కనువిందుగా సాగింది. భ్రమరాంభ సమేత మల్లేశ్వరస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల దేవతలు కొలువుదీరే కనుమ పార్వేట ఉత్సవం ఈసారి కరోనా వల్ల భక్తులు లేక వెలవెలబోయింది.
కృష్ణా జిల్లా మైలవరంలో ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 250 మంది మహిళలు పోటీపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
విశాఖ జిల్లా మాడుగులలో కనుమ సందర్భంగా... గొర్రెలు, మేకలకు వివాహం జరిపించారు. పూర్వీకుల నుంచి ఇది ఆనవాయితీగా వస్తోందని యాదవ కులస్తులు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో బొడ్డెడ మురళికి చెందిన కుటుంబసభ్యులు... సుమారు 50 మంది ఒకచోట చేరి అరిటాకులో భోజనం చేశారు.