Sajjala comments : పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని.. ఒక్కోసారి వైసీపీ అధికారంలో ఉందా లేదా..! అన్న ఆలోచన వస్తోందని సజ్జల పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా వైఎస్సార్సీపీ తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. అర్జెంటుగా అధికారం చేపట్టాలన్న తీరులో చంద్రబాబు ఉన్నారని.. ఆయనకు కలలు మాత్రమే మిగులుతాయన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు.
టీడీపీకి సాంకేతిక బలం ఉంది...తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదని, వ్యవస్థలో ఎక్కడైనా మేనేజ్ చేసే అవకాశం ఉంటుందనే అనుమానంతో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వానికి ఓ సేనాధిపతిలా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుకు సాంకేతికంగా టీడీపీకి బలం ఉందని, అయితే ఆ పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చారని అన్నారు. ఆ పార్టీ ఏదైనా ప్రలోభాలకు పాల్పడే అవకాశాలున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.
టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మరోసారి పరిశీలించాలని మేం ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరాం. కానీ, ఫలితాలు వెల్లడించిన తర్వాతనే అవకాశం ఉంటుందని చెప్పడంతో మళ్లీ లెటర్ పెట్టాం. నిబంధనల ప్రకారం మేం పూర్తిగా రీకౌంటింగ్ కోరే అవకాశాలున్నాయి. కానీ, అలా కాకుండా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను, వాటిని వేరు చేస్తూ చేసిన కట్టలను మళ్లీ పరిశీలించాలని కోరుతున్నాం. ఇది మా హక్కు. అడిగే హక్కు ఉందని చట్టం చెప్తుంది. దాని ప్రకారమే అడుగుతున్నాం, అంతే తప్ప.. వితండ వాదం కాదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా పది, ఇరవై ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారయ్యాయి. ఇవాళ్టి ఫలితాలకు అధికారులు కారణమై ఉండొచ్చు అని కూడా మేం భావిస్తున్నాం. ఆయా వర్గాలను ప్రభావితం చేయడంలో టీడీపీ వైరస్ లాంటిది. గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపులో టీడీపీకి చెందిన ప్రముఖ నాయకులు ఏజెంట్ల స్థానంలో వచ్చి కూర్చోవడాన్ని ఎలా భావించాలి. అధికారులను దబాయించే నాయకులను అక్కడ ఉంచారు. వీటిని గమనిస్తుంటే మేం అధికారంలో ఉన్నామా అనే సందేహం వస్తోంది. లిఖిత పూర్వకంగా కాకుండా ఓరల్ గా అడిగినా మళ్లీ లెక్కించాల్సి ఉంది. అయినప్పటికీ మా విన్నపాన్ని రిటర్నింగ్ అధికారి పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను పోటీచేయించగలదా..? - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు