ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది: సజ్జల - Sajjala Ramakrishna Reddy on Employees Protest

AP govt Employees Protests over prc gos: ఉద్యోగులు చర్చలకు వస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రుల కమిటీ తెలిపింది. పీఆర్సీ జోవోలపై అపోహలు తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ప్రభుత్వంతో చర్చించకుండా ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేదన్నారు.కొన్నిచోట్ల ఆర్థిక సంబంధమైన బిల్లులను అప్‌లోడ్‌ చేయకుండా ఆపుతున్నారు. అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

By

Published : Jan 27, 2022, 3:56 PM IST

Updated : Jan 28, 2022, 4:14 AM IST

Sajjala Ramakrishna Reddy on Employees Protest: ‘కొన్నిచోట్ల ఆర్థిక సంబంధమైన బిల్లులను అప్‌లోడ్‌ చేయకుండా ఆపుతున్నారు. అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది. చాలా తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేక చర్యగానూ భావించవచ్చు. అయినా సరే వచ్చి, చర్చించి సమస్యను పరిష్కరించుకోండని చెబుతున్నాం. మేం వేచి చూస్తున్నా వారు రాకపోవడం దురదృష్టకరం’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘సమ్మెకు వెళ్తామంటున్నారు. చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె నిషిద్ధం. అయినా ప్రభుత్వం దీనిపై ఆలోచించడం లేదు. సీఎం సమక్షంలో ఫిట్‌మెంట్‌ ప్రకటించి, అంతా అయ్యాక... మళ్లీ మొదటికి వెళ్లడమంటే పరిపకత్వలేని తనం. అంతకంటే పెద్ద మాట మాట్లాడాలి. అందరూ బాధ్యతాయుత నేతలు. తొందరపాటు నిర్ణయం వద్దు. చర్చలకు రావాలని మళ్లీ కోరుతున్నాం. అపోహలను తొలగించేందుకు అవసరమైతే నాలుగు మెట్లు దిగాలనే ఉద్దేశంతో మూడోసారి వచ్చాం. ఆహ్వానం పంపడంతోపాటు ఫోన్‌చేసి స్వయంగా నాయకులతో మాట్లాడాం. చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుంది తప్ప, ఎక్కడో కూర్చొని డిమాండ్‌ పెట్టి... టీవీల్లో మాట్లాడితే సరిపోదు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చర్చిద్దామని ఇంతలా చెబుతున్నా రాకపోవడం దురదృష్టకరం. ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఉంటోందని చెబుతున్న ప్రతినిధులను... ఎలా పరిష్కరించుకోవాలనే దానికి వేరొక మార్గం ఏదైనా ఉందా? అని అడిగితే సమాధానం లేదు. చర్చలకు రాకుండా... షరతులు పెట్టడం సరికాదు’ అని తెలిపారు.

ఇతర ఉద్యోగ సంఘాల నేతలూ రావొచ్చు
‘పోరాట సమితి సభ్యులే కాకుండా, ఇతర ఏ సంఘాల సభ్యులు వచ్చినా చర్చలు జరుపుతాం. వారిచ్చే మంచి సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం’ అని సజ్జల పేర్కొన్నారు. ‘వాళ్లు ప్రత్యర్థులు, శత్రువులు కాదు. మా ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు. పే స్లిప్‌లు వస్తే ఎవరికెంత పెరిగిందో తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా నష్టపోతే సరిచేసేందుకు కట్టుబడి ఉన్నాం. సీఎం పాజిటివ్‌గా ఉండే వ్యక్తి. మీ నాయకులకు చెప్పి, చర్చలకు పంపండని ఉద్యోగలోకానికి విన్నవిస్తున్నాం. చేయి దాటిపోకముందే అంశాన్ని ముగించే దిశగా ఆలోచించాలని కోరుతున్నాం’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘మీరు రాయబారులు కాదు. హెచ్‌ఆర్‌ఏపై వాళ్లు చర్చకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. ఎంత పీఆర్సీ పెరిగినా కొంత అటోఇటో తేడా ఉంటుంది. దీనిపై టీవీలు, టెంట్లలో మాట్లాడతారా? అధికారిక కమిటీతో మాట్లాడతారా? రాజకీయపార్టీగా మేం దీనిని రాజకీయం చేయడంలేదు’ అని మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బాధ్యత ఉండాలి కదా?: బొత్స

‘27న మళ్లీ మనం కూర్చుందాం అని వారే చెప్పారు. అయినా రాలేదు. బాధ్యత ఉండాలి కదా. వారు చెప్పేదే జరగాలంటే కుదరదు కదా. ప్రభుత్వాన్ని నడిపేది వాళ్లే కదా’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘మొదట కమిటీకి ఆర్డర్‌ ఏదని ప్రశ్నించారు. ఉత్తర్వు వచ్చాక.... ఈ కమిటీతో మాకేమవసరం అంటున్నారు. చర్చలకు రమ్మంటే రానంటున్నారు. చర్చల సమయంలో ఆర్థిక శాఖ అధికారులది తప్పని నిరూపించగలిగితే ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాం’ అని తెలిపారు.

ఉద్యోగుల ఉద్యమం ఉద్ధృతం...

AP govt Employees Stage Protests : మరోవైపు పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌, గుంటూరులో కలెక్టరేట్‌ ఎదురుగా ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. మెరుగైన పీఆర్సీ ఇవ్వడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలన్నారు.

PRC GOs issue in ap: కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైయ్యాయి. పీఆర్సీ సాధన సమితి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, శివారెడ్డి దీక్షలను ప్రారంభించారు. తాము ప్రభుత్వంతో చర్చలకు రావడం లేదంటూ మంత్రులు కమిటీ పదేపదే చెప్పడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. మూడు రోజుల క్రితమే తాము తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని చర్చలకు పంపించామని స్పష్టం చేశారు. ఆ కమిటీ ద్వారా తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా తెలియజేశామన్నారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పకుండా తమపై నిందారోపణలు మోపడం తగదన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :TDP LEADERS MEET GOVERNOR: 'కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి తొలగించండి'

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Jan 28, 2022, 4:14 AM IST

ABOUT THE AUTHOR

...view details