చంద్రబాబు దీక్షపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు 36 గంటల పాటు ప్రహసనంగా డ్రామా చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన దీక్షకు కారణమేంటో కూడా ఎవరికీ తెలియదన్నారు. చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట దాడులు, సవాళ్లు దూషణలు, రెచ్చగొట్టడంపైనే జరిగిందన్న సజ్జల.. దీక్ష అంతా ఫాల్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 36 గంటల పాటు దీక్ష చేస్తే కనీసం నీరసం రాదా అని ప్రశ్నించారు. దీక్షకు కారణాల గురించి కనీసం చంద్రబాబు ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు.
'పట్టాబి ఏమన్నారో వినలేదని చంద్రబాబు అంటున్నారు. పట్టాబితో బూతులు తిట్టించిందే చంద్రబాబు. ఇప్పుడు బూతు గురించి తెలియదని అంటున్నారంటే ప్రజలు అమాయకులని అనుకుంటున్నారా..? ఇప్పటికైనా చేసిన తప్పును చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలి. అధికారంలోకి వచ్చాక గంజాయి నివారణపై సీఎం సమీక్షలు చేసి చర్యలు తీసుకున్నారు. మాదక ద్రవ్యాలపై ఇప్పటివరకు 7689 కేసులు నమోదయ్యాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక 3800 గంజాయి కేసులు నమోదయ్యాయి. గంజాయి విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్దాలే. రాష్ట్రంలో విద్వంసంసృష్టించాలని చంద్రబాబు కుట్రలు చేశారు. దీక్ష ముగింపు ప్రసంగంలోనూ ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారు. దీనికోసమే పట్టాబితో చంద్రబాబు బూతులు మాట్లాడించి రెచ్చగొట్టారు' - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు