ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రగతి రథ చక్రం టైర్ పంక్చర్
ప్రతిరోజూ కోటిన్నర మందిని గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ... అప్పుల దారిలో ఆపసోపాలు పడుతోంది. ఆదాయానికి, వ్యయానికి పొంతన లేక ఆర్థిక కష్టాల్లోకి వెళ్లిపోయింది. రోజూ వారీ ఖర్చు తిరిగి రాక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్ని పొదుపు చర్యలు తీసుకుంటున్నా... నాలుగేళ్లలో వరుసగా 734 కోట్లు, 789, 1205, 1029 కోట్ల నష్టాలు చవిచూస్తోంది.
కిలోమీటర్‌కు రూ. 6.53 నష్టం
ఏటా 157.63 కోట్ల కిలోమీటర్ల దూరం ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఖర్చు కిలోమీటర్‌కు 44.58 రూపాయలు ఉంటే... 38.05 రూపాయలే రాబడి వస్తోంది. అంటే కిలోమీటర్‌కు 6.53 రూపాయల చొప్పున, రోజుకు 2 కోట్ల 80 లక్షల రూపాయల నష్టం వస్తోంది. రాష్ట్రంలోని 128 డిపోల్లో పదే లాభాల్లో నడస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అవసరాల కోసం చేసే అప్పులు 3 వేల380 కోట్లకు చేరాయి. వీటికి వడ్డీలు అదనం. పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కార్మికుల సహకార పరపతి సంఘం నుంచి 272 కోట్లు, పీఎఫ్ ట్రస్టు నుంచి 671 కోట్లు ఖర్చు చేసేసింది.
ప్రభుత్వం ఆదుకుంటేనే గట్టెక్కేది
డీజిల్ ధరలు, సిబ్బంది వేతనాలు పెరుగుతున్నా... ప్రజలపై ఆ స్థాయిలో భారం మోపే అవకాశం లేక నష్టాలు మూటకట్టుకుంది. వేతన సవరణ బకాయిలు గత ఉగాదికి ఇస్తామని హామీ ఇచ్చినా... చిల్లిగవ్వలేక చేతులెత్తేసింది. ఫలితంగానే కార్మికులంతా సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం నుంచి బకాయిలు వస్తే తప్ప కోలుకొనే పరిస్థితి లేదని యాజమాన్యం చెబుతోంది. సంస్థకు రావాల్సిన రాయితీల సొమ్ము 998 కోట్లు, కొత్త బస్సుల కొనుగోలుకు 666 కోట్లు, వివిధ రుణాల చెల్లింపునకు 2వేల 52 కోట్లు సహా మొత్తం 3వేల 717కోట్లు ఇస్తే తప్ప... బయట పడలేమని స్పష్టం చేసింది.
మోదీ వల్లే రాజకీయాల్లో హుందాతనం కొరవడింది: సీఎం ఇవీ చదవండి...