RTC Buses Stopped Due to Roads Damaged :దారిపొడవునా గుంతల మయమై.. చీలికలుగా మారి.. తారు రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవాల్సిన స్థితిలో నిర్మానుష్యంగా కనిపిస్తోన్న ఈ రహదారిని చూడండి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, గుడివాడ నియోజక వర్గాల్లోని పలు గ్రామాల ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా రవాణా సేవలందిస్తోన్న దారి ఇది. నాలుగేళ్ల క్రితం వరకు ఈ రహదారి వాహనాల రాకపోకలతో కళకళలాడేది. పచ్చని పంట పొలాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టేవి.
People Facing Problems Due to Worst Roads : పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నుంచి పామర్రు నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ పెదపారుపూడి మీదుగా గుడివాడకు బస్సులు తిరిగేవి. 30 కిలో మీటర్ల మేర ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో ఈ దారిలో ప్రయాణించేందుకు విద్యార్థులు, ప్రజలు ఆసక్తి చూపేవారు. ప్రైవేటు వాహనాలు, వ్యక్తిగత వాహనాలతో రహదారి నిత్యం రద్దీగా ఉండేది. వర్షాల ధాటికి ఏర్పడ్డ చిన్నపాటి గుంతలను ఆర్అండ్బీ శాఖ అధికారులు వెంటనే పూడ్చకుండా చేతులెత్తేయడంతో నాలుగున్నర ఏళ్లలో ఈ రహదారి ఇదిగో ఇలా దారుణంగా తయారైంది.
Roads Situation in AP : జువ్వనపూడి, అప్పిగట్ల, ముదునూరు, బోళ్లపాడు, కాటూరు, గండిగుంట, తదితర గ్రామాలు విజయవాడ, ఉయ్యూరు, గుడివాడ వెళ్లాలంటే ఈ దారే దిక్కు. రహదారుల మరమ్మతులకు వైసీపీ సర్కార్ నయాపైసా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో నాలుగు సంవత్సరాలుగా రోడ్ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. తట్టెడు మట్టీ వేయకపోవడంతో చిన్నపాటి గుంతలు చెరువులుగా మారాయి. రోడ్డు పక్కన మొలిచిన చిన్నపాటి కంప చెట్లనూ తొలగించకపోవడంతో అవి క్రమంగా పెరిగి ప్రస్తుతం రెండు వైపులా విస్తరించి రోడ్డు మొత్తాన్ని మూసివేశాయి. కంప చెట్లు కమ్ముకున్న ఈ రోడ్డుపై రావాలంటే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.