Round Table Meeting on Polavaram Project: 2019 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు నత్తతో పోటీ పడుతున్నాయని విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నేతలు మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాకపోయినా సీఎం జగన్ అడగడం లేదని.. ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం లేదని.. విపక్షాలు మండిపడ్డాయి.
ఇప్పటికే అనేకసార్లు పోరాటాలు చేసినా.. అఖిలపక్షాన్ని దిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేసినా.. జగన్‌లో మాత్రం చలనం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరాన్ని వెంటనే పూర్తి చేసేలా సీఎం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నాటక ఎన్నికలలో బీజేపీ నేతలంతా కలిసి పర్యటించినా అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని.. జగన్ ఇకనైనా నోరు తెరిచి ధైర్యంగా సమస్యలు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నేతలు కోరారు.
పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామన్న జగన్.. ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని మాజీ మంత్రి దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డయా ఫ్రం వాల్, స్పిల్ ఛానల్, ఆర్ అండ్ ఆర్కు కట్టిన డబ్బులు కూడా వచ్చాయన్న ఆయన.. 31 మంది ఎంపీలు ఉన్నా జగన్ ఎందుకు నిధులు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
పోలవరం నిర్మాణం నిలిచిపోతే కేంద్రాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయని సీఎం నిర్వాసితులను ముంచేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా తీరు మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అటు నిర్వాసితులకు న్యాయం చేయాలని అడిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల గారడీ చేస్తున్నాయని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. వెంటనే పునరావాస ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.