Round table meeting on special status: విభజన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అధికార వైకాపా, భాజపా మినహా మిగిలిన రాజకీయ పక్షాలు పాల్గొని రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా... ఏపీకి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాయి. అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వైకాపా నాయకులు... కేసుల మాఫీ కోసం ప్రధాని దగ్గర సాగిలపడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు.
అజెండాలో పెట్టి తొలగించడం అవమానించడమే..
సమావేశానికి అందరూ వస్తున్నారా అని అడిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు తెలుసున్నాక హాజరుకాలేదని సీపీఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రామకృష్ణ ఆక్షేపించారు. హోదా అంశాన్ని అజెండాలో పెట్టి తొలగించడం అవమానించడమే అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగానే భాజపా భావిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని... ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు.