ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి గుర్తూ... అవసరమేరా! - రోడ్డు గుర్తులు

చూడ్డానికి చిన్న విషయంలా ఉంటుంది. కానీ చాలామందికి అవగాహనే లేదు. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనిపించే గుర్తులను భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన చేసుకుందాం

road safety measurements
రహదారి భద్రత

By

Published : Jan 25, 2021, 1:04 PM IST

మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డుపై ఇరు వైపుల అనేక రకాల సంకేతాలను చూస్తుంటాం. అందులో కొన్ని దారి చూపితే.. మరికొన్ని సమాచారాన్ని అందిస్తుంటాయి. వీటిని అతిక్రమిస్తే ట్రాఫిక్‌ నింధనలు ఉల్లంఘనగా పరిగణించి అందుకు జరిమానా విధిస్తారు. అయితే వీటిపై చాలా మందికి అవగాహన లేదు. కొంతమందికి ఉన్నా.. ఏం కాదులే అన్ని పట్టించుకోకుండా ప్రయాణిస్తుంటారు. . వాహనం నడపడం రావడం కంటే.. రహదారి భద్రత నిబంధనలు, గుర్తులు తెలుసుకోవడం ముఖ్యం. అందుకే లైసెన్సు పరీక్ష కోసం ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లినప్పుడు రోడ్డు సైన్‌బోర్డుల విషయంలో ఎంత అవగాహన ఉందనేది పరీక్షిస్తారు. అంటే వాహన చోదకుడికి నైపుణ్యం కంటే.. ఇది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్ఛు ప్రస్తుతం రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కొన్ని ముఖ్యమైన సూచికలను గురించి తెలుసుకుందాం..

ప్రవేశం నిషిద్ధం

ప్రవేశం నిషిద్ధం అని చెప్పే గుర్తు

ఈ గుర్తు ఉన్న రోడ్డులో వాహనాలను నడపకూడదు. అలాచేస్తే చట్టరీత్యా నేరం అవుతుంది. అందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

వాహనాలు నిలుపరాదు

వాహనాలు నిలుపరాదు అని గుర్తు చేసే సూచి

విజయవాడలో ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డుల్లో ఈ బోర్డులు కనిపిస్తుంటాయి. అయినా వాటి ముందే పార్కింగ్‌ చేస్తుంటారు.

వన్‌వే

వన్​వే అని చూపే గుర్తు

వాహనాలకు ఒక వైపు ప్రవేశం ఉంటుంది. విజయవాడలోని బకింగ్‌హాం పోస్టాఫీసు రోడ్డు వన్‌వే. అయినా ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తుంటారు.

స్పీడ్‌ లిమిట్‌

స్పీడ్ లిమిట్ 50 మాత్రమే అని చెప్పే గుర్తు

ఈ ఫొటో ప్రకారం వాహనాన్ని 50కి.మీ కంటే వేగంగా నడపకూడదు. ఎంజీరోడ్డులో వాహన వేగం 20-40 కి.మీ మాత్రమే. అయితే ద్విచక్రవాహనదారులు దూసుకుపోతుంటారు.

యూటర్న్‌ చేయకూడదు

యూటర్న్ నిషిద్ధం అని చెప్పే గుర్తు

ఎడమవైపు తిరగరాదు

ఎడమ వైపు తిరగరాదని చెప్పే గుర్తు

హారన్‌ కొట్టకూడదు

హారన్ కొట్టకూడదు అని సూచించే గుర్తు

ఈ గుర్తు ఉన్న చోట అవసరం లేకుండా హారన్‌ కొట్టకూడదు. పాఠశాలలు, ప్రార్థనాలయాలు, ఆసుపత్రుల దగ్గర ఈ గుర్తు బోర్డు ఉంటాయి. దీన్ని అతిక్రమిస్తే జరిమానా విధిస్తారు.

బరువులు మించకూడదు

4 టన్నుల బరువు దాటరాదు అని చెప్పే గుర్తు

ఈ సంకేతం ఉన్న చోట వాహనాల బరువు 4 టన్నులు దాటరాదు.

ఇక్కడ ఎటువంటి వాహనాలను ఆపకూడదు

వాహనాలు ఆపకూడదు అని సూచించే గుర్తు

ఎత్తు పరిమితి

3.5 మీటర్ల కంటే ఎత్తు ఉండకూడదని సూచించే గుర్తు

ఈ గుర్తు ఉన్న చోట వాహనాల ఎత్తు 3.5 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు.

ఎడమవైపు తిరగాలి

ఎడమ వైపు తిరగాలనే సూచించే గుర్తు

ఈ విధంగా నీలం రంగులో ఉన్న గుర్తులు తప్పనిసరిగా పాటించాలని అర్థం. ఆ రంగులో ఉన్న సూచికలు దేన్ని సూచిస్తాయో వాటిని పాటించాలి. ఈ గుర్తు ప్రకారం తప్పనిసరిగా ఎడమవైపు తిరగాలి.

రోడ్డు వెడల్పు

రోడ్డు రెండు మీటర్ల వెడల్పు మాత్రమే ఉందని చెప్పే గుర్తు

రోడ్డు వెడల్పు కేవలం 2 మీటర్లు మాత్రమే ఉంటుంది. నెమ్మదిగా వెళ్లాలి అని చెబుతుంది.

అనుమతి లేదు

నడిచేందుకు... రోడ్డు దాటేందుకు అనుమతి లేదని చెప్పే గుర్తు

ఈ గుర్తు ఉన్న చోట పాదచారులు నడవడానికి/రోడ్డు దాటడానికి అనుమతి ఉండదు.

ఓవర్ టేకింగ్ చేయకూడదు

వాహనాలను ఓవర్ టేక్ చేయకూడదని హెచ్చరించే గుర్తు

వాహనాలను ఓవర్‌ టేకింగ్‌ చేయకూడదు. చాలా ప్రమాదకరమని తెలియజేస్తుంది.

సీటుబెల్ట్‌.. శిరస్త్రాణం అనివార్యం

వాహనం నడిపేటప్పుడు సీటుబెల్ట్‌, బైక్‌పై వెళ్లేవారికి శిరస్త్రాణం రక్షణ కవచాలు. కారు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రతి నలుగురిలో ఇద్దరు వాహనం నుంచి ఎగిరి బయట పడుతున్నవారే. సీటు బెల్ట్‌ పెట్టుకుంటే ఈ పరిస్థితి ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు సీటు బెల్ట్‌ ధరిస్తే ప్రమాదం జరిగినా బెలున్లూ తెరచుకోవడంతో పాటు.. ఆ సమయంలో వాహన తలుపులు తెరచుకున్నా మనిషి కిందపడేందుకు అవకాశం ఉండదు. హెల్మెట్లు ధరించని ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో కిందపడి తలకు గాయాలై మృతి చెందుతున్న కేసులు లెక్కకు మించి ఉంటున్నాయి.

విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు (శాతాల్లో)

శిరస్త్రాణం లేకుండా 71.67

నో పార్కింగ్‌ 11.60

వన్‌వే 5.19

సిగ్నల్‌ దాటడం: 4.17

ముగ్గురితో బైక్‌రైడింగ్‌ 3.9

సీటు బెల్ట్‌ పెట్టుకోని వారు 1.19

పరిమితికి మించి మనుషుల్ని ఎక్కించుకోవడం 0.87

ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం 0.85

అతివేగం 0.56

ఇదీ చదవండి:అర్హత ఉన్నా అందని అమ్మఒడి

ABOUT THE AUTHOR

...view details