రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
అనంతపురం జిల్లా మడకశిరలో....
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం బైరేపల్లి గ్రామ సమీపంలోని మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తిప్పేస్వామి అనే యువకుడు మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వీరిని 108 వాహనం ద్వారా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కనగానపల్లి మండలం బద్దలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. వీఆర్వో మద్దిలేటి మృతి చెందాడు. ఆదివారం రాత్రి కనగానపల్లి నుంచి స్వగ్రామమైన బద్దలాపురం ద్విచక్ర వాహనంపై.. వెళ్తుండగా వాహనం అదుపుతప్పి వీఆర్ఓ మద్దిలేటి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.
మంత్రాలయం వద్ద...
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామ సమీపంలో కారు, ఆటో ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న15 మహిళ కూలీలతో సహా ఆటో డ్రైవర్ సైతం గాయపడ్డాడు. మాధవరం గ్రామానికి చెందిన వీరంతా.. పక్క గ్రామం సూగురులో మిరప పంటలో పనుల కోసం వెళ్తుండగా ఘటన జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలోని చినబొడ్డు వెంకట పాలెంకు చెందిన ముగ్గురు మహిళలు.. ఆదివారం రాత్రి మట్లపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. పడవల వద్ద జాతీయ రహదారిపై కాకినాడ వైపు వెళ్తున్న కారు.. వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ తో సహా మహిళలను సైతం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేరు కామేశ్వరి అనే మహిళ మృతిచెందగా.. శేరు లక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు.. కామేశ్వరి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో తప్పులు నమోదు చేశారని.. నిందితులను వదిలేశారని ఆరోపిస్తున్నారు.