రోడ్డు ప్రమాదాలు పలువురి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ కారణంగా నిత్యం ఎంతో మంది విగతజీవులవుతున్నారు. పలువురు శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. ఏటేటా రోడ్డు ప్రమాదాలలో మరణాలు పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల గణాంకాలు పరిశీలిస్తే.. ప్రమాదాలలో కాస్త తగ్గుదల కనిపించింది. మృతులు, క్షతగాత్రుల సంఖ్య కూడా తగ్గింది. దీనికి అధికారుల చర్యలతో పాటు, ప్రధానంగా లాక్‌డౌన్ కూడా కలిసొచ్చింది. ఈ సంఖ్యను మరింత తగ్గించడంపై కృష్ణా జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది.
ఎక్కువ ద్విచక్ర వాహనాలతోనే..
ద్విచక్ర వాహనాల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత భారీ వాహనాల వల్ల సంభవిస్తున్నాయి. మద్యం తాగి నడపడం, రవాణా వాహనాలకు వెనుక వైపు రిఫ్లెక్టర్లు లేకపోవడం, అధిక బరువుతో వెళ్లడం, తదితర కారణాలతోనూ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికుల వాహనాల్లో పరిమితికి మించి ఎక్కించడం, సరకు తీసుకెళ్లే వాహనాల్లో జనాలను ఎక్కించడం, అతివేగంతో నడపడం కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. జాతీయ రహదారులపైన కూడా వంద కి.మీ వేగం దాటితే ప్రాణాలకు హామీ లేని పరిస్థితి. మొత్తం ప్రమాదాల్లో దాదాపు 65 శాతం వరకు ఈ కారణంగానే సంభవిస్తున్నాయి. యువకులు ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.