'మనకు ఎన్నో ఇచ్చిన అడవికి ఎంతో కొంత తిరిగివ్వాలి.. లేకపోతే!' ప్రశ్న: నమామి గంగే ప్రాజెక్టు తరహాలోనే రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి జీవనదుల తీరాల్లో అటవీ ప్రాంతాన్ని పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనికోసం అటవీశాఖ కార్యాచరణ ఏమిటి?
జవాబు: దేశవ్యాప్తంగా 13 ముఖ్యమైన నదుల పక్కన అటవీ ప్రాంతాన్ని పెంచాలన్నది లక్ష్యం. ఏపీలో కృష్ణా, గోదావరి జీవనదుల తీరాల్లోనూ దట్టమైన అటవీ ప్రాంతాల్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ రెండు నదులు నిరంతరం ప్రవహించాలంటే సమీపంలో భూమి కోతకు గురికాకుండా అటవీ ప్రాంతం ఉండాల్సిందే. దీనికి కేంద్రంతో పాటు వివిధ జాతీయ సంస్థలు డీపీఆర్‌లు రూపొందించాయి. అటవీ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంది. కృష్ణా నది నిరంతర ప్రవాహం ఉండాలంటే దాని పరీవాహక ప్రాంతాన్ని రక్షించాలి. పరీవాహక ప్రాంతంలో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ప్రధాన భూమిక పోషిస్తోంది. దీన్ని పరిరక్షించుకోవాలి. ప్రస్తుతం 63 పులులు ఇక్కడ ఉన్నాయి. అక్కడ జీవవైవిధ్యంతో పాటు సహజంగా ఉండే ప్రకృతి సంపదనూ కాపాడుకోవాలి.
ప్రశ్న: రాష్ట్రంలో వందల కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న కృష్ణా,గోదావరి నదుల తీరాల వెంట పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణలున్నాయి. ఇన్ని సవాళ్ల మధ్య రివర్ రెజునివేషన్ కార్యక్రమం చేపట్టేందుకు మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి?
జవాబు: ఇక్కడ 2 అంశాలు కీలకంగా ఉంటాయి. అటవీశాఖ పరిధిలో ఉన్న ప్రాంతాలు, ఇతర శాఖల పరిధిలో ఉన్న ప్రాంతాలను వేర్వేరుగా చూడాల్సి ఉంది. కృష్ణా నదికి సంబంధించి శ్రీశైలం టైగర్ రిజర్వ్, అభయారణ్యం పూర్తిగా అటవీశాఖ ఆధీనంలో ఉంది. అక్కడ ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. అక్కడ పరీవాహక ప్రాంతాన్ని రక్షించే వీలుంటుంది. ఇక ఇతర ప్రాంతాలు సాధారణంగా జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్నాయి. చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. నదుల గట్ల వెంబడి వృక్షాలను పెంచేందుకు అవసరమైన కార్యాచరణ కావాలని అడిగితే అటవీశాఖ సిద్ధంగా ఉంటుంది.
ప్రశ్న: ఏపీలో 23 శాతం అటవీ ప్రాంతం ఉంది. దేశంలోనే ఎక్కువ శాతం అటవీ ప్రాంత ఉన్న రాష్ట్రం మనదే. అయితే పచ్చదనం 17 శాతమే ఉంది. ఈ వ్యత్యాసాన్ని ఎలా భర్తీ చేయబోతున్నారు?
జవాబు: రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో 23 శాతం మేర అటవీ ప్రాంతం ఉంది. ఇంత ప్రాంతం రిజర్వు ఫారెస్టుగా ఉన్నప్పటికీ మీరన్నట్టుగా 17 శాతం మాత్రమే మంచి పచ్చదనం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అందుకే మిగిలిన ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించే అంశంపై అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తంగా 33 శాతం పచ్చదనం ఉండాలి. అంటే రిజర్వు ఫారెస్టు బయట మరో 10 శాతంమేర భూమి హరిత ప్రాంతంగా మారాల్సి ఉంది. పట్టణీకరణ జరుగుతున్న ఈ తరుణంలో ఇది చాలా ముఖ్యమైన సవాలు. నగరాలు విస్తరిస్తున్న కారణంగా కొంచెం ప్రాంతం కూడా మొక్కలు, పచ్చదనం పెంచేందుకు లభ్యం కావటం లేదు. అలాంటిది వందల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఇక మనకు ఉన్న అవకాశాలు కేవలం కాలువ గట్లు, రైల్వే లైన్లను ఆనుకుని ఉన్న ఖాళీ జాగాలు అవసరం అవుతాయి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల వెంట పచ్చదనం పెంచాలి. సంస్ధాగతంగా పచ్చదనం పెంచే ప్రయత్నాలు చేయాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా పచ్చదనం పెంచేందుకూ ప్రయత్నించాలి.
ప్రశ్న: పచ్చదనం పెంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలంటున్నారు. పచ్చతోరణం కార్యక్రమం అని అటవీశాఖ- రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాయి. ప్రభుత్వ శాఖలు ఈ పని చేస్తున్నాయా?
జవాబు: రాష్ట్రంలో పచ్చదనం పెంచడాన్ని చాలా కీలకమైన అంశంగా రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది వివిధ విభాగాల ద్వారా 20 కోట్ల మేర మొక్కలు నాటాలని లక్ష్యాలుగా నిర్దేశించాం. మొక్కలు నాటటం సరే కానీ వాటిని ఆ తదుపరి రక్షించటమే కీలకమైన బాధ్యత. అందుకే ప్రజలు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ 10 మొక్కలు నాటి వాటిని కాపాడేలా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ప్లాంట్ అండ్ ప్రోటెక్ట్ అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. దీనికి చాలా అవగాహన ముఖ్యం. ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థలు భాగస్వామ్యం వహించాలి.
ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు సీడ్ డిబ్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు కదా. ఏ మేరకు విజయవంతమైంది?
జవాబు:సీడ్ డిబ్లింగ్ను రెండు విధాలుగా అమలు చేస్తున్నాం. ఏరియల్ సీడింగ్ ద్వారా ఒకటి అలాగే నేరుగా రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో నాటడం ఒకటి. హెలికాప్టర్ల ద్వారా పెల్లెట్లుగా మార్చి వేర్వేరు ప్రాంతాల్లో విసురుతున్నాం. సహజమైన అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ను వేస్తున్నాం. ఇలా సహజంగా నాటిన సీడ్ బాల్స్ ఎక్కువగా విజయవంతం అయ్యాయి. ఏరియల్ సీడింగ్ చేసిన కార్యక్రమం అంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇందులో పాఠశాల విద్యార్దులను భాగస్వాములను చేసి సహజమైన అటవీ ప్రాంతంలో వాటిని నాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఏరియల్ సీడింగ్ కంటే ఇది విజయవంతం అయ్యిందని చెప్పలగలను.
ప్రశ్న: పట్టణ ప్రాంతాల్లో కాసింత పచ్చదనం దొరకటమే గగనం. ఉష్ణోగ్రతలు తీవ్రతరం అవుతున్న తరుణంలో అర్బన్ ఫారెస్ట్రీని పెంచేందుకు అటవీశాఖ ఏం కార్యక్రమాలు చేపట్టింది?
జవాబు:ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్తపథకాన్ని ప్రారంభించింది. నగర్ వన్ యోజన పేరిట ఈ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. నగర ప్రాంతాల్లో రిజర్వు ఫారెస్టు ప్రాంతాలు ఉన్నప్పటికీ పచ్చదనం పెంపు కోసం నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీలో రెండు ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని చెప్పారు. దీనిపై ప్రతిపాదనలు ఇప్పటికే పంపాం. కేంద్ర నిధుల కోసం చూడకుండా ఇప్పటికే రాష్ట్రంలో 23 నగర వనాలను సిద్ధం చేశాం. రాజమహేంద్రవరం, తిరుపతి, కడప ఇలా వేర్వేరు చోట్ల నగర వనాలు సిద్ధమయ్యాయి. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఉదయం, సాయంత్రపు నడకల కోసం, ఆహ్లాదం కోసం వారు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అర్బన్ ఫారెస్ట్రీలో ఇతర విభాగాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. ఈ విషయంలో అటవీశాఖ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.
ప్రశ్న: శ్రీశైలం టైగర్ రిజర్వులో పులుల సంతతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అభయారణ్య పులుల ప్రాజెక్టు ఏ స్థితిలో ఉంది?
జవాబు:1972లో మొదటిగా దీన్ని కేంద్రం టైగర్ రిజర్వుగా ప్రకటించింది. అటవీశాఖ తీసుకున్న వివిధ చర్యల కారణంగా ఏపీ, తెలంగాణాల్లో విస్తరించిన ఈ రిజర్వు ఫారెస్టులో పులుల సంతతి పెరిగింది. దేశవ్యాప్తంగానూ పులుల సంతతి పెరగటం శుభసూచికం. నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వు దేశంలోనే అతిపెద్దది. 3 లక్షల 70 వేల హెక్టార్లలో విస్తరించిన ఈ అభయారణ్యంలో ప్రస్తుతం 63 పులులు ఉన్నాయి. ఇది కృష్ణా నదీ ప్రధాన పరివాహక ప్రాంతం. స్థానికంగా ఉన్న చెంచులను ఈ ప్రాజెక్టులో భాగస్వాములను చేయడం ద్వారా జంతువుల వేట లేకుండా చూస్తున్నాం. గడచిన కొన్నేళ్లుగా ఒక్క ఘటన జరగలేదు. పులుల సంరక్షణలో అవి అసహజంగా మరణించకుండా చూడటమే అత్యంత కీలకమైన అంశం. అయితే అడవిలో ఒకదానికి ఒకటి పోరాడుతూనో లేక వ్యాధుల కారణంగానో చనిపోవటం సాధారణం.
ప్రశ్న: ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ ఏడాది ఎలాంటి చర్యలు చేపట్టారు?
జవాబు:ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత అరుదైన జాతి వృక్షం ఎర్రచందనం ఇక్కడ లభ్యం అవుతోంది. అటవీశాఖ-పోలీసు విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి దీన్ని సంరక్షిస్తున్నా అడపాదడపా స్మగ్లింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. పూర్తిగా స్మగ్లింగ్‌ను అరికట్టడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఏపీ నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. తిరుపతిలోని అటవీశాఖ సెంట్రల్ గోదాములో ఈ నిల్వలు ఉన్నాయి. ఏటా వెయ్యి మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అంతర్జాతీయ విపణిలో అందుబాటులో ఉంచితే స్మగ్లింగ్ దిగివస్తుందని అంచనా వేశాం. అధికారికంగా విక్రయాలు జరిగితే తెరచాటు వ్యవహారాలన్నీ తగ్గిపోతాయి. ఏ సమయంలోనైనా ఈ 6 వేల మెట్రిక్ టన్నుల విక్రయానికి అనుమతులు రావొచ్చు. ఇది క్లిష్టమైన ప్రక్రియే ఎందుకంటే అంతరించిపోతున్న వృక్షజాతుల్లో ఉన్న ఎర్రచందనం విక్రయాలపై జెనీవా నుంచి అనుమతి రావాలి.
ప్రశ్న: ఎర్రచందనంతో పాటు కాఫీ తోటలు, మిరియాలు లాంటి వాణిజ్య పంటలు అరకు లాంటి చోట్ల పండుతున్నాయి. వీటి ఆదాయంపై దృష్టి పెట్టారా?
జవాబు:కొవిడ్ కారణంగా ఏపీతో పాటు అన్ని రాష్ట్రాల ఆదాయం పడిపోయింది. ప్రభుత్వాలు ముందుగా ప్రాధాన్యం ఉన్న విభాగాలపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. ఇందులో ఆఖరున అటవీశాఖ ఉంటుంది. అయితే వచ్చే రెవన్యూ, చేసే ఖర్చులకు అనుగుణంగా మేం కూడా ఆదాయ ఆర్జనపై ప్రణాళిక చేస్తున్నాం. రెడ్ అనే కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు సహజ అటవీ ప్రాంతాన్ని పరిరక్షిస్తున్న దేశాలకు నిధులు ఇస్తున్నాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్, యూన్ డీపీ ద్వారా కొంత మొత్తాలు వస్తాయి. ఈ నిధులను రాబట్టేందుకు ఓ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించాం. అంతర్జాతీయ వనరుల ద్వారా ఈ నిధుల్ని రాబట్టాలన్నది మా ప్రయత్నం. పూర్తిగా అటవీ ప్రాంతాల రక్షణకే దీన్ని వినియోగిస్తాం.
ప్రశ్న: పర్యాటకుల ద్వారానూ కొంతమొత్తంలో ఆదాయం వచ్చే అవకాశముంది. ఎకో టూరిజం పార్కులు లాంటి వాటిని అభివృద్ధి చేయటం, మౌలిక సదుపాయల కల్పనకు అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలేమిటి?
జవాబు: కొవిడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి జూపార్కులు, నగర వనాలు, మారేడు మిల్లి లాంటి ఎకో టూరిజం పార్కులు మూసివేశాం. సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే అవి మనగలుగుతాయి. వాటిని మూసివేయటం వల్ల రెవెన్యూ తగ్గిపోయింది. నిబంధనలు సడలించిన తర్వాత ఇప్పుడు మళ్లీ వాటిని తెరవాలని భావిస్తున్నాం. మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. రాష్ట్రంలో కొత్త నగరవనాలు, ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అవన్నీ స్వయం చాలిత విధానంలోనే ఉంటాయి.
ప్రశ్న: సముద్ర తీరప్రాంతాల్లో మడ అటవీ విస్తీర్ణం రోజురోజుకూ తగ్గుతోంది. వీటి పరిరక్షణకు మీరేం చర్యలు తీసుకుంటున్నారు?
జవాబు:రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో విస్తరించిన ఉన్న మడ అడవులు తుపాన్ల సమయంలో అక్కడి గ్రామాలను పరిరక్షించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. చాలా సమయాల్లో ఇది నిరూపితం అయ్యింది. అందుకే వీటిని రక్షించేందుకు మేం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాం. కాకినాడ తీరంలోని కోరింగా, కృష్ణా అభయారణ్యం, గుంటూరు, నెల్లూరు వద్ద ఈ తరహా మడ అడవుల విస్తరణ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. వీటిని పెంచటం క్లిష్టమైన ప్రక్రియ. బురద నేలలు, క్రీక్లలో వీటిని నాటాల్సి ఉంటుంది. అందుకే ఫిష్ బోన్ టెక్నిక్ అనే విధానం ద్వారా మడ అడవులను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్మెంట్ జోన్లో భాగంగా నిధులు రావాల్సి ఉంది. రాగానే పనులు ముమ్మరం చేస్తాం.
ప్రశ్న: ఎకో సిస్టం సర్వీసెస్ పేరిట మీరు రూపొందించిన విధానం ఏమిటి. ఇది అడవుల రక్షణకు ఎలా ఉపకరిస్తుంది?
జవాబు:అడవి మనకు చాలా ఇస్తోంది. సంపద రూపంలో కొలిస్తే నీరు, ఆక్సిజన్ , పండ్లు, ఫలాలు, కలప, నదుల వ్యవస్థను కాపాడటం , జంతుజాలాలు ఇలా అన్నీ కాపాడుతోంది అడవి. కోట్ల రూపాయల సంపద సృష్టిలో అవి భాగస్వామ్యం అవుతున్నాయి. వీటిని కొలిచేందుకు చాలా శాస్త్రీయమైన విధానాలు ఉన్నాయి. శ్రీశైలం టైగర్ రిజర్వు సృష్టిస్తున్న సంపదను ఐఐఎం భోపాల్ లెక్కించింది. మన పర్యావరణ వ్యవస్థ సమాజానికి ఇస్తున్న సంపదను లెక్కిస్తే .. 3 లక్షల 70 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం మనకు ఇస్తున్న మొత్తం రూ. 50వేల 130 కోట్లుగా లెక్కించారు. ఈ అటవీ ప్రాంతం నుంచి వస్తున్న నీటి విలువ రూ.5 వేల 55 కోట్లు, ఇస్తున్న ఆక్సిజన్ మొత్తం రూ. 2051 కోట్లు, పర్యావరణ సమతుల్యత రూ. 4302 కోట్లు , కలప, పండ్లు ఫలాలు లాంటి వాటివల్ల రూ. 76 కోట్ల రూపాయల మేర సంపద వస్తోంది. ఓ చిన్న అటవీ ప్రాంతం ఇస్తున్న ప్రయోజనాలివి. అదే 23 శాతం ఉన్న అటవీ ప్రాంతం ఇస్తున్న సంపదను గణిస్తే లక్షల కోట్లు ఉంటుంది. ఇంత ఇస్తున్న అడవి మనం ఏమిస్తున్నామని అలోచించాలి. కనీసమాత్రంగానైనా వనరులు తిరిగి ఇవ్వగలిగితే ఫలితాలు ఉంటాయి. పన్నులు వసూలు చేసేప్పుడు ప్రభుత్వాలు కొంత మొత్తమైనా అటవీ సంరక్షణకు ఇవ్వాల్సిన అవసరముంది.
ఇవీ చదవండి:
త్వరలో నాపై దాడి జరగబోతోంది: రఘురామకృష్ణరాజు