కృష్ణా జిల్లా దివిసీమలో సుమారు లక్షా యాభై వేల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో కాల్వల మీద ఆధారపడి రైతులు వరి సాగుచేస్తారు. నేల స్వభావాన్ని బట్టి ఒక్కో ఎకరానికి సుమారు 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. కొందరు రైతులు పాత పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతులైన వేదసాగు, డ్రం సీడర్ ద్వారా సుమారు ఇరవై వేల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. కూలీల ఖర్చు, పెట్టుబడి వ్యయం ఎక్కువై పంటను మాసివ్ హార్వేస్టర్ మిషన్ ద్వారా కోతలు కోయిస్తున్నారు. ఎక్కువమంది రైతులు కూలీల ద్వారా కోతలు కోయించి వరి కుప్పలు వేసి వాటిని నూర్పిడి చేస్తారు. ఏ పద్ధతిలో వరి నూర్పిడి చేసినప్పటికీ... పండిన పంటలో సుమారు 2 శాతానికి పైగా ధాన్యం నేలపాలు అవుతుంది. ఈ వరి గింజలు అందరి పొలాల్లో మినుము లేదా తరువాత వేసే పంటల్లో మొలకెత్తుతాయి.
విత్తనం వేయకుండానే
కృష్ణాజిల్లా మోపిదేవి మండలం, పెదప్రోలు గ్రామ పరిధిలో ముమ్మనేని వెంకట చలపతి రావు అనే రైతు.. తన 12 ఎకరాల పొలంలో జులైలో దుక్కి దున్ని వదిలి వేశారు. లోతున పడిన వరి గింజలు మెులకెత్తాయి. తమ పొలంలో అందరిలాగే మినుము, వరి మొక్కలు విపరీతంగా పెరిగాయి. కలుపు మందు పిచికారి చేయగా మినుము చనిపోయి వరి ఏపుగా పెరిగింది. అందరితోపాటుగా ఎకరానికి సుమారు 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాడు. పొలంలో ఒక్క వరి గింజ వేయకుండా వరి పండించటం చూసి చుట్టూ పక్కల రైతులు ప్రతి రోజు వందల సంఖ్యలో వచ్చి రైతు పొలాన్ని చూసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కోడూరు మండలంలో లింగారెడ్డి పాలెంలోనూ ఏడు ఎకరాల్లో వరి విత్తనాలు జల్లకుండా ఈ విధానంలో వరి పండించారు.