Grain purchases : ఖరీఫ్ మాదిరిగానే ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీర పాండ్యన్ కోరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
నియమ, నిబంధనలు పాటించాలి...తణుకులోని నెక్ కళ్యాణ మండపంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విషయంలో చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన నిబంధనలపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీర పాండ్యన్ మాట్లాడుతూ గడిచిన ఖరీఫ్ సీజన్లో రైస్ మిల్లర్లు సక్రమంగా కొనుగోలు చేయడం వల్ల ముఖ్యమంత్రి సైతం అభినందించారని చెప్పారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఆన్లైన్ విధానంలో ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. రైతులకు అవసరమైన సంచులను అందజేయడంతో పాటు రైతులతో నేరుగా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఫుటేజ్‌ని ఎప్పటికప్పుడు అందజేయాలని వీర పాండ్యన్ ఆదేశించారు.