విజయవాడలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ముంపు కష్టాలు త్వరలో తీరబోతున్నాయి. నగరంలో ప్రకాశం బ్యారేజీకి దిగువున ఎడమ వైపు నాలుగు కిలోమీటర్ల మేర నివాస ప్రాంతాలు ఉన్నాయి. కనకదుర్గమ్మ వారధి నుంచి యనమలకుదురు కొండవరకు ఇదే పరిస్థితి. కరకట్ట నుంచి నది మార్జిన్ వరకు దాదాపు 50 వేల మంది వరకు నివసిస్తున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడల్లా 5 డివిజన్లలో విస్తరించిన ఈ ప్రాంతాలు నీట మునుగుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయాంలో 138 కోట్ల రూపాయలతో రక్షణ గోడ నిర్మించారు. 2.28 కిలోమీటర్ల నిడివితో కోటినగర్ నుంచి యనమలకుదురు కొండ వరకు చేపట్టారు. 2018లో ప్రారంభమైన పనులు ప్రస్తుతం 90 శాతం వరకు పూర్తయ్యాయి.
ఈ ఏడాది వరద ప్రభావం వల్ల 115 రోజులు పైగానే.. బ్యారేజీ నుంచి కిందకు నీటిని వదలాల్సి వచ్చింది. ఫలితంగా మొదటి దశ గోడ నిర్మించిన ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల.. జనావాసాలు ఎక్కువ రోజులు నీటిలోనే ఉన్నాయి. వారధి నుంచి కోటినగర్ వరకు ఉన్న చలసాని నగర్, కృష్ణలంక, గీతానగర్, రాణిగారితోట, బాలాజీ నగర్, ద్వారకానగర్, భ్రమరాంబపురం ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు మిగిలిన ఒకటిన్నర కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 123 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. వీఎస్‌ఎస్-స్యూ-ఎస్పీ ఉమ్మడి సంస్థ పనులు దక్కించుకుంది. వచ్చేఏడాది వరద సీజన్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు విధించింది.