భూసమస్యలకు శాశ్వత పరిష్కారం... కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం... - ఏపీలో భూ రీసర్వే అప్ డేట్స్
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు-భూమిరక్ష ద్వారా ఎప్పటి నుంచో వివాదంలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది. మరికొన్ని సమస్యలు జటిలంగా మారుతున్నాయి. రీసర్వేకు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో ప్రారంభించారు. జగ్గయ్యపేట మండలంలో అధికారులు సర్వే నిర్వహించారు. జనవరి నుంచి రాష్ట్రమంతా విస్తరించనున్నారు.
రీసర్వే
By
Published : Nov 7, 2020, 7:12 AM IST
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని అక్కడికక్కడే పరిష్కారం అవుతుండగా, మరికొన్ని జటిలంగా మారుతున్నాయి. వ్యవసాయ భూముల వివాదాలకు తెర దించేందుకు రెవెన్యూ శాఖ చేపట్టిన రీసర్వే ప్రాజెక్టును రాష్ట్రంలోని అన్ని మండలాలకు జనవరి నుంచి విస్తరించనున్నారు. గతంలో మనిషికి ఆధార్ తరహాలోనే భూములకు భూధార్ నంబరు ఇస్తామన్నారు. అప్పట్లో కృష్ణా జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. దాదాపు 90% పూర్తిచేశారు. తర్వాత దాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం రీసర్వే ప్రారంభించారు. దీనికి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు-భూమిరక్ష’ అనే పేరును ఖరారు చేశారు. రికార్డుల్లో ఉన్న భూవిస్తీర్ణాన్ని ఈ వాస్తవ సర్వేతో సరిపోల్చి సరిదిద్దనున్నారు. పథకానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియను సర్వే అండ్ సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డ్సు విభాగం పర్యవేక్షిస్తోంది. వచ్చే రెండేళ్లలో రాష్ట్రమంతా సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* జగ్గయ్యపేట మండలం రామచంద్రునిపేటలోని ఆ భూమి వాస్తవానికి దేవాదాయ శాఖది. కొన్నేళ్లుగా ఓ రైతు సాగు చేస్తున్నారు. ఇటీవల భూముల రీసర్వేలో విషయం వెలుగులోకి వచ్చింది. అసలు తమకు అక్కడ భూమి ఉన్న విషయం అధికారులకు తెలియకపోవడం గమనార్హం.
* వారసత్వ భూమిని ఇద్దరు దాయాదులు పంచుకున్నారు. సర్వే నంబరు 44-1లో ఒక వాటా 4.59 ఎకరాలు ఉంది. మరోవాటా 4.29 ఎకరాలే ఉంది. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన తక్కెళ్లపాడు రీసర్వేలో తేలిన విషయమిది.
రెండు విధానాలతో సర్వే
భూములను కార్స్(కంటిన్యువస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్), డ్రోన్ అనే రెండు విధానాల్లో సర్వే చేస్తున్నారు. తొలివిధానంలో రోవర్‌ను వాడతారు. తక్కెళ్లపాడు, రామచంద్రునిపేట, జయంతిపురం, తిరుమలగిరి, గౌరవరం, త్రిపురవరం గ్రామాల్లో కార్స్‌ను అమలుచేస్తారు. ఈ పరిజ్ఞానంతో ఉపగ్రహాలకు అనుసంధానించి డిఫరెన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(డీజీపీఎస్) ద్వారా సర్వే చేస్తున్నారు. కార్స్ బేస్ స్టేషన్లను జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, విజయవాడలలో ఏర్పాటుచేశారు. క్షేత్రస్థాయిలో రోవర్‌తో భూముల సరిహద్దులను గుర్తించి బేస్ స్టేషన్‌లకు అనుసంధానం చేస్తారు. ఇక రెండో విధానంలో.. నిర్దేశిత భూమిని డ్రోన్‌తో ఫొటో తీస్తారు. దానిలోని హద్దుల ఆధారంగా సమగ్ర సర్వేచేస్తారు.
భూయజమానులకు సమాచారం
జగ్గయ్యపేట మండలంలోని 18 వేల మంది భూయజమానులకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు అందించారు. తమ వద్ద నున్న దస్తావేజులు, ఇతర ధ్రువీకరణలతో రీసర్వేకు హాజరు కావాలని సూచించారు. తక్కెళ్లపాడులో మొత్తం 1538.98 ఎకరాల భూమి రికార్డుల్లో ఉంది. 270.37 ఎకరాల ప్రభుత్వ భూమి సర్వే పూర్తిచేశారు. ఇందులో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. 1268.60 ఎకరాల ప్రైవేటు భూమి రీసర్వే ప్రారంభించారు. భూముల రీసర్వే ఫలితాలను కార్స్ స్టేషన్ ద్వారా సెంట్రల్ కమాండ్ స్టేషన్‌కి పంపి అక్కడ కొత్త ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్(ఎఫ్‌ఎంబీ) రూపొందిస్తారు. సబ్‌డివిజన్ల స్థాయిలో కూడా రీసర్వే పూర్తిచేసి నూతన రీసర్వే రిజిస్టర్(ఆర్‌ఎస్‌ఆర్) రూపొందించాలన్నది సర్వే శాఖ ఆలోచన. ఈ సర్వేలో వందశాతం కచ్చితత్వం ఉంటుందని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరు కె.మాధవీలత స్పష్టంచేశారు.