Concerned about land dwellers: ) గన్నవరం విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన నిర్వాసితులు రోడ్డునపడ్డారు. ఇళ్లు కోల్పోయి ఏళ్లు గడిచినా.. ప్రభుత్వ ప్యాకేజీ అందలేదంటూ బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి అద్దె చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకావడం లేదన్నారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగటం ఉద్రిక్తతకు దారితీసింది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టును విస్తరించారు. అంతకు ముందు ఉన్న రన్‌వే విస్తరణ కోసం బుద్దవరం పంచాయతీలోని గ్రామాల పేదల ఇళ్లు, భూములు సేకరించారు. ఇళ్లు కోల్పోయిన వారికి 9 లక్షల ప్యాకేజీతోపాటు నూతన గృహాలు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. .ఉంగుటూరు-గన్నవరం ప్రధాన రహదారిపై దావాజీగూడెం వద్ద రోడ్డుపై బైఠాయించారు. పురుగులమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు.
గన్నవరం మండలం దావాజీగూడెం, బుద్ధవరం, అజ్జంపూడి, కేసరపల్లికి చెందిన రైతులు భూములిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇళ్లు పూర్తిగా కూల్చివేశారని...అద్దె చెల్లిస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదన్నారు.