ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాయానికి రెడ్‌క్రాస్‌ ఎప్పుడూ ముందుంటుంది: గవర్నర్

ప్రజా సేవకు అంకితమైన రెడ్​క్రాస్ సంస్థ సేవలను గవర్నర్ బిశ్వభూషణ్ ప్రశంసించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రెడ్‌క్రాస్‌ సంస్థ ఎప్పుడు ముందుంటోందని రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ కొనియాడారు.

గవర్నర్

By

Published : Oct 1, 2019, 1:21 AM IST

అవార్డుల ప్రదానోత్సవంలో గవర్నర్

మానవత్వం, నిష్పక్షపాతం, స్వచ్ఛంద సేవ, స్వాతంత్య్రం, సమానత్వం, ఐక్యత, ప్రపంచీకరణ ప్రధాన సూత్రాలుగా నడుస్తున్న రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్రంలో విశేష సేవలందిస్తోందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రశంసించారు. ప్రత్యేక పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన రెడ్ క్రాస్ సంస్థ వచ్చే ఏడాది వంద సంవత్సరాల్లోకి అడుగుపెట్టబోతోందన్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్‌ రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రెడ్‌క్రాస్‌ సంస్థ ఎప్పుడూ ముందుంటోందని రాష్ట్రంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ కొనియాడారు. తలసేమియా, హేమోఫిలియా ట్రాన్స్ఫ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా శాఖను అభినందించారు. 2018-19 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మూడు విభాగాల్లో సేవకులకు శిక్షణ ఇచ్చిందని- ప్రథమ చికిత్స, అత్యవసర సమయాల్లో బాధితులను ఆదుకోవటం, విపత్తు నిర్వహణ సమయాల్లో సహాయక కార్యక్రమాల్లో భాగస్వామ్యం గురించి తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో సేవలందిస్తోన్నసెర్వ్‌ కార్యక్రమం భవిష్యత్తులో మరింతగా విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

వందకు పైగా పతకాల అందజేత

యువజన సర్వీసులశాఖ సంచాలకులు సి.నాగరాణి, ఆర్టీసీ ఎండీ తిరుమల కృష్ణబాబు, ఐఏఎస్ అధికారులు ఇంతియాజ్‌ అహ్మద్‌, సత్యనారాయణ, డాక్టరు హరి జవహర్‌లాల్‌, జె.నివాస్‌, కార్తికేయ మిశ్రా, కె.వి.ఎన్‌.చక్రదర్‌బాబు, వి.ప్రసన్నవెంకటేష్‌లకు బంగారు పతకాలు అందజేశారు. వీరితో పాటు వంద సంవత్సరాల రెడ్‌క్రాస్‌ సన్నాహక ఉత్సవాల్లో భాగంగా వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. వాటిలోని విజేతలకు నగదు పురస్కారాలను ప్రదానం చేశారు. రెడ్ క్రాస్ కార్యక్రమాల నిర్వహణలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల సిబ్బంది, జిల్లాల కలెక్టర్లకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 130 పతకాలు, జ్ఞాపికలు, షీల్డులను గవర్నర్‌ ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముందు గవర్నర్‌ అధ్యక్షతన రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రెడ్‌‌క్రాస్‌ రాష్ట్ర శాఖ ఛైర్‌పర్సన్‌ రేచల్‌ ఛటర్జీ, ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షుడు ముకేష్‌కుమార్‌ మీనా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2018-19 సంవత్సరంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, ఇతర సేవలు, ప్రణాళిక అంశాలపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details