కొవిడ్ కారణంగా ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు విడిచారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చింది. సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పుడు రెడ్ క్రాస్ సంస్థ నుంచి ఉచితంగా మాస్క్ లు, హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి మెడిసిన్ కిట్లను అందజేశారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేశారు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు కాన్సంట్రేటర్లను అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
సింగపూర్, మలేషియా, అమెరికా నుంచి దాతలు విరాళంగా ఇచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రెడ్ క్రాస్ సంస్థ జిల్లా ఛైర్మన్ డా.సమరం... బాధితులకు అందిస్తున్నారు. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న బాధితులు, కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన వారిలో ఆక్సిజన్ అవసరమైన వారికి సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
అందుబాటులో 65 కాన్సంట్రేటర్లు..
విజయవాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ సొసైటీ.. బ్లడ్ బ్యాంక్ కేంద్రంగా ఈ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో 65 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నయని డా.సమరం తెలిపారు. వీటిలో 20 విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అందిస్తున్నామన్నారు. జిల్లాలో అవనిగడ్డలో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచి బాధితులకు ఉచిత సేవలందిస్తున్నామని చెప్పారు.