కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిన్న కొల్లు రవీంద్ర, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓటు వేసేందుకు వెళ్లిన తన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న కారణంతో మచిలీపట్నం జలాల్పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద రవీంద్ర బైఠాయించి నిరసన తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చిన కొల్లుకు, వైకాపా ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇనగుదురుపేట సీఐ శ్రీనివాసరావు కొల్లును వెళ్లిపోవాలని సూచించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రజాస్వామ్యంపై గౌరవంతో వ్యవహరిస్తున్న తమను చంపేయాలనుకుంటున్నారా అని కొల్లు రవీంద్ర పోలీసులపై వాఖ్యలు చేశారు. గెలుపు కోసం ఎన్నడూ లేని విష సంస్కృతికి పేర్ని నాని శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై ఉదయాన్నే కొల్లు రవీంద్ర నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. కొల్లు రవీంద్ర అరెస్టు సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అరెస్టులకు భయపడేది లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఇదేం న్యాయమని అడిగితే తనపైనే కేసు పెట్టారని ఆక్షేపించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు.
కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. ఆయన వద్ద నుంచి రక్త నమూనాలు సేకరించారు. కొల్లు రవీంద్రపై 356, 506, 188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడినట్లు.. న్యాయవాది విష్ణుతేజ తెలిపారు. కేసు విచారణకు పోలీసులకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించినట్లుగా తెలిపారు. న్యాయస్థానం కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసింది.
కొల్లు రవీంద్ర అరెస్టును తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఖండించారు. ‘సీఎం జగన్ బీసీ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. బీసీలను పండుగ రోజు కూడా సంతోషంగా ఉండనీయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లు వేసుకున్న వైకాపా నేతలపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలపై దౌర్జన్యాలు పతాకస్థాయికి చేరాయని ధ్వజమెత్తారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా అని నిలదీశారు. కొల్లు రవీంద్ర చేసిన నేరమేంటని ప్రశ్నించారు.