రవిశేఖర్... ఈ పేరు వింటే చాలు కృష్ణా జిల్లా దావులూరు గ్రామస్థులు ఉలిక్కిపడతారు. దోపిడీలు, దొంగతనాలు చేయటం రవికి వెన్నతో పెట్టిన విద్య. 2001లో నేర ప్రవృత్తిని ప్రారంభించాడు. ఇప్పటి వరకు సుమారు 50 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జైలుకూ వెళ్లి వచ్చాడు. అయినా అదే తీరు. ఇప్పుడు అతడి కోసం మరోసారి పోలీసులు వెతుకుతున్నారు.
చదివింది ఏడే.. క్రైమ్‌లో మాత్రం పీహెచ్డీ - fraud
చదివింది ఏడో తరగతి... కానీ ఎదుటి వారిని బురిడీ కొట్టించడంలో పీహెచ్డీ చేశాడు. ఇప్పటికే 50 కేసుల్లో నిందితుడు.. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ ట్రాక్ రికార్డ్ అంతా ఎవరిదనుకుంటున్నారా? కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన రవిశేఖర్ది. తాజాగా ఓ యువతిని ఉద్యోగాల పేరిట అపహరించుకుపోయి కలకలం సృష్టిస్తున్నాడు ఈ నేరస్థుడు.
ఎలాగోలా... మోసం చేసేసి బతకాలనుకునే రవి మరో దారుణం చేశాడు. బీ - ఫార్మసీ విద్యార్థినికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి హైదరాబాద్‌లో అపహరించుకుపోయాడు. ఇప్పటి వరకు దోపిడి, దొంగతనాలు చేసిన రవి.. ఓ యువతిని కిడ్నాప్ చేయడం ఇదే మెుదటిసారి. ఈ నేరగాడి చరిత్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లలో తెలుసు. గుంటూరులోని కంకిపాడులో పోలీస్ స్టేషన్లో అంతర్రాష్ట్ర నేరస్తుడిగా ఇతడిపై క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇలా అనేక కేసులు నమోదైన పరిస్థితిలో... 2009లో రవిశేఖర్ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు. జైలు నుంచి పరారైన సమయంలో ఒకటి రెండు సార్లు గ్రామానికి వచ్చాడు. 2014లో బంధువులనే మోసం చేసి మళ్లీ పరారయ్యాడు.
ఐదేళ్ల క్రితం రవి భార్య భాగ్యలక్ష్మి మృతి చెందింది. అతడికి ఓ కొడుకు, కుమార్తె. రవి శేఖర్ గన్నవరం వద్ద వసతిగృహంలో ఏడో తరగతి వరకూ చదువుకున్నాడు. అప్పుడే దొంగతనాలు చేయడం అలవాటైంది. కుటుంబ సభ్యులంతా వ్యవసాయ కూలీలే. ఇప్పుడు యువతిని అపహరించి మళ్లీ వార్తల్లో నిలిచాడు రవిశేఖర్.