రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు డిమాండ్ చేశారు. ఇంటింటికీ రేషన్ పథకాన్ని తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పథకం అమలులో తమను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ తమను రేషన్ పంపిణీలో పాల్గొనవద్దని ఆదేశాలిస్తే.. స్థానిక అధికారులు రేషన్ పంపిణీలో పాల్గొనాలని చెబుతున్నట్లు డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాధవరావు తెలిపారు. తమకు రావాల్సిన రూ.180 కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిన వెంటనే చెల్లించాలన్నారు.
కరోనా సమయంలో మృతి చెందిన రేషన్ డీలర్స్ కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. తమను రేషన్ స్టాక్ పాయింట్ డీలర్లుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదని ఆవేదన చెందారు. ఏపీ రేషన్ డీలర్ల సమస్య పరిష్కారానికి తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం మద్దతు తెలిపింది. సమస్యను ఆలిండియా అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు నాయకోటి రాజు అన్నారు.