తుమ్మ అలివేలమ్మకు భర్త, పిల్లలు లేరు. బంధువులున్నా.. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. విజయవాడ... గోసాల గ్రామం నుంచి ఆరేళ్ల క్రితం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడికుదురు గ్రామంలోని ఆలయానికి చేరుకుంది. ఆలయం పరిసర ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ కాలం వెళ్లదీసేది. ఆలయానికి వచ్చిన వారు తమకు తోచిన సాయం చేసేవారు. అలా వచ్చిన వెయ్యి రూపాయలు కూడబెట్టుకుని.. నడికుదురు గ్రామం ప్రక్కన మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే కృష్ణా నది ఎడమ కరకట్టపై చిన్న పరదాతో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది.
కాళ్లరిగేలా తిరిగినా రేషన్ అందలేదు
అలివేళమ్మకు ఆధార్ కార్డు ఉంది. 3 ఏళ్లుగా.. రేషన్ కార్డు కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా రాలేదు. వితంతు పింఛనూ అందలేదు. తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులుండేది. ఆమె దీనగాథపై 'గుడిలో చిల్లరతో గుడిసె వేసుకున్నా... ఆధార్ ఆకలి బాధ తీర్చలేదు' అని ఈటీవీ భారత్ కథనం ఇచ్చింది. దీనిపై రేషన్ డీలర్ స్పందించారు.