ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవాలయాల పరిరక్షణకు త్వరలో రథయాత్ర - bjp meeting in vijayawada

విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన శనివారం పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలని భాజపా నిర్ణయించిందన్నారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తామే ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నిశ్చయించింది.

దేవాలయాల పరిరక్షణకు త్వరలో రథయాత్ర
దేవాలయాల పరిరక్షణకు త్వరలో రథయాత్ర

By

Published : Mar 14, 2021, 5:37 AM IST

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలని భాజపా నిర్ణయించింది. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తామే ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శిస్తూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని నిశ్చయించింది. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన శనివారం పదాధికారుల సమావేశం జరిగింది. అనంతరం సమావేశ వివరాలను శాసన మండలి సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ విలేకరులకు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేసి సత్తా చాటుతామని పేర్కొన్నారు. దేవాలయాల పరిరక్షణకు కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకు రథయాత్రను త్వరలో చేపడతామని వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జరిగే ప్రచారంలో వాస్తవం లేదని, పరిశ్రమ మూతపడదని, ఉద్యోగాలు పోవని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే కేంద్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంటును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు ఎందుకు అప్పగించాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. చేతనైతే తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలను అక్కడి ప్రభుత్వమే నడపాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో భాజపా మద్దతుతో గెలిచిన అభ్యర్థులను సన్మానిస్తామని చెప్పారు. పదాధికారుల సమావేశంలో భాజపా ఏపీ వ్యవహారాల సహ బాధ్యుడు సునీల్‌ దేవధర్‌, జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విశాఖకు బయ్యారం గనులివ్వాలి: సత్యకుమార్‌

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు పరిశ్రమపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బయ్యారం ఇనుప ఖనిజాన్ని కేటాయించాలని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి కొనుగోలు చేసి నడపాలని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ సూచించారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రులను తరిమి కొడతామన్న తెరాస నేతలు ఉక్కు పరిశ్రమకు మద్దతుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం సహజమని, ఎప్పటి నుంచో ఈ విధానం ఉందని వెల్లడించారు. ప్రజల్లో భావోద్వేగం ఉందని కేంద్ర పార్టీకి చెబుతున్నామని తెలిపారు. పుర, నగరపాలక సంస్థల ఫలితాల తర్వాత విశాఖలో జెండా, టెంటు ఎత్తివేయకపోతే తనను అడగాలని పేర్కొన్నారు.
మతమార్పిళ్లకు పాల్పడుతున్న వైకాపా: సునీల్‌ దేవధర్‌
వైకాపా ప్రభుత్వం విశాఖ ఉక్కు అంశాన్ని ముందు ఉంచి తెరవెనుక మతమార్పిళ్లు చేస్తోందని సునీల్‌ దేవధర్‌ విమర్శించారు. గుంటూరు జిల్లాలో అక్రమంగా పెద్ద శిలువ ఏర్పాటు చేస్తే అధికారులు తగిన రీతిలో స్పందించలేదన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కుటుంబ, కుల, అవినీతి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

ఇవీ చదవండి

పుర ఓట్ల లెక్కింపు నేడే.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

ABOUT THE AUTHOR

...view details