రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచింది. కొన్ని కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఎగువున కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో
తిరుమలలో 4 గంటల పాటు ఏకధాటిగా వాన పడింది. రహదారులు జలమయమయ్యాయి. ఆలయానికి వెళ్లేందుకు భక్తులు, అర్చకులు ఇబ్బందులు పడ్డారు. కొండపై చలి తీవ్రత పెరిగింది. తాజా వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద చేరిందని అధికారులు తెలిపారు.
కడప జిల్లాలో
అల్పపీడన ప్రభావం వల్ల కడపలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశమంత నల్లటి మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. కడపలోనూ ఎడతెరిపి లేని వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. డ్రెయినేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, అప్సర రోడ్డు, ఎన్జీవో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. మురికి కాలువలు పొంగి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై నీళ్లు చేరడంతో..వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నెల్లూరు జిల్లాలో
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. స్వల్ప గాలులు వీచాయి. నెల్లూరు నగరంలో రాత్రి 8 గంటల నుంచి వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. గాంధీబొమ్మ, వహాబ్‌పేట, మూలాపేట, సంతపేట, నీలగిరి సంఘం తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. కాలువలు పూడికతో నిండిపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహించి.. వాహనదారులు, ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.