ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటమునిగిన ఆక్వా చెరువులు.. ఉత్పత్తులు కొనే నాథులే లేరు - ఆక్వా పరిశ్రమలపై వరద ఎఫెక్ట్ వార్తలు

కొల్లేరుకు మూడు దశాబ్దాల తరవాత అతి భారీ స్థాయిలో వరద వచ్చింది. ఒకేసారి వేల క్యూసెక్కుల నీళ్లు సరస్సు సామర్థ్య స్థాయిని మించి ప్రవహించడంతో ఉగ్రరూపాన్ని సంతరించుకుంది. స్థానిక గ్రామాలతోపాటు సరస్సు చుట్టుపక్కల ఉన్న వేల ఎకరాల చేపల చెరువులను తనలో కలిపేసుకుంది. వరద ముంపులో ఒక్కో చెరువు మునిగిపోతుంటే రైతులు వాటిని రక్షించుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. పోనీ తక్కువ ధరకైనా అమ్మేందుకు ఈ దశలో పట్టుబడి చేద్దామనుకుంటే కొనే నాథులే లేరు.

నీటమునిగిన ఆక్వా చెరువులు..  ఉత్పత్తులు కొనే నాథులే లేరు
నీటమునిగిన ఆక్వా చెరువులు.. ఉత్పత్తులు కొనే నాథులే లేరు

By

Published : Oct 19, 2020, 10:58 AM IST

దసరా మహోత్సవాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతులు నిలిచిపోయాయి. కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకు వచ్చినా మార్కెట్‌ ధరలో ఐదో వంతు తక్కువకు అడుగుతున్నారు. కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చెరువుల చుట్టూ వలలు ఏర్పాటు చేసుకున్నారు. వరద అంతకంతకు పెరగడంతో ఈ చెరువుల్లో సైతం చేపలు ఉంటాయన్న నమ్మకాన్ని కోల్పోవాల్సి వస్తోంది. రూ.లక్షల్లో పెట్టిన పెట్టుబడులు కొల్లేటి గంగ పాలయ్యాయి. ప్రభుత్వమే చేపల రైతులను ఆదుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

తగ్గిన గిరాకీ

రాష్ట్రంలోని చేపల ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా మార్కెట్‌ ఉంది. చలి ఎక్కువగా ఉన్న బెంగాల్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, దిల్లీ, బిహార్‌, హరియాణా, యూపీ, ఎంపీ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అక్కడ దేవీ నవరాత్రుల నిర్వహణ మొదలైంది. ఈ పదిరోజులు మాంసాహారాన్ని పూర్తిగా నిషేధిస్తారు. ఏటా ఈ పదిరోజులు చేపల ఎగుమతులు నిలిచిపోతాయి. వరదలు సైతం ఈ సమయంలో రావడంతో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి. వరదల్లో చిక్కుకుపోయిన చేపల చెరువుల్లో పట్టుబడులకు ఎవరూ ముందుకు రావడం లేదు. స్థానిక మార్కెట్లలో దళారులు ముందుకు వచ్చినా కేజీ రూ.20కు అడుగుతుండడం రైతులకు మింగుడు పడడం లేదు.

నిల్వచేసుకునే వీలు లేదు

చేపల ఉత్పత్తిలో దేశానికే తలమానికంగా ఉన్న కృష్ణా జిల్లాలో మత్స్య ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి కనీసం అవకాశాలు లేకపోవడం గమనార్హం. శీతల గిడ్డంగులు అందుబాటులో ఉంటే విపత్తుల సమయంలో, ధరలు తక్కువగా ఉన్నప్పుడు వాటిని నిల్వ చేసుకుని తర్వాత అమ్ముకునే వీలుంటుంది. అవి లేకపోవవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని సాగుదార్లు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రొయ్యలకు శీతల గిడ్డంగుల అవసరం అధికంగా ఉంటోంది.

25 వేల ఎకరాల్లో పంటనష్టం

వరదల కారణంగా జిల్లాలో 25 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల దిగుబడులు నష్టపోయినట్లు రైతు సంఘాలు వాపోతున్నాయి. ఎక్కువగా కైకలూరు, మండవల్లి, నందివాడ, కలిదిండి మండలాల్లో వేల ఎకరాలు నీటమునిగాయి. కొల్లేరు లంక గ్రామాలైన శృంగవరప్పాడు, పెంచికలమర్రు, కొట్టాడ, నత్తగుళ్లపాడు, కొల్లేటికోట, కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు, పెనుమాకలంక, నందిగామలంక గ్రామాల్లో చెరువుల జాడ లేదు. దీనివల్ల సుమారు రూ.350 కోట్ల నష్టం వాటిల్లినట్లు వాపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో ఇలా జరిగిందని రైతు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి.

తీవ్రంగా నష్టపోయాం

అనుకోని విధంగా కొల్లేరుకు వచ్చిన వరదతో కైకలూరు నియోజకవర్గంలోని వేల మంది సాగుదార్లం తీవ్రంగా నష్టపోయాం. కనీసం పట్టుబడి చేసుకోవడానికి వీలు లేకుండాపోయింది. కొందరు తమ పంటను కాపాడుకున్నా వాటిని కొనేవారు లేరు. కొందరు వ్యాపారులు ముందుకు వచ్చినా కేజీ రూ.15-20లకు అడుగుతున్నారు. ఈ ధరలలో పట్టుబడిచేస్తే వల ఖర్చులైనా వచ్చే పరిస్థితి లేదు. - ఆంథోని, చేపల రైతు, ఆటపాక

ప్రభుత్వానికి నివేదిస్తాం

కొల్లేరు వరదల కారణంగా నష్టపోయిన చేపల చెరువులను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. నియోజకవర్గంలో 25వేల ఎకరాల చేపలు, రొయ్యల చెరువులు వరదల్లో చిక్కుకున్నాయి. వరద తగ్గితే కాని నష్టాన్ని పూర్తిగా అంచనా వేయలేం. శీతల గిడ్డంగుల గురించి ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మంజూరైతే నిర్మించి రైతులకు అందుబాటులోకి తెస్తాం. - వర్థన్‌, ఇన్‌ఛార్జి ఏడీఏ, మత్స్యశాఖ

ఇదీ చదవండి: అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details