ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

raid on cinema theatres : సినిమా థియేటర్లపై చర్యలు.. కారణం అదే! - krishna district jc

raid on cinema theatres : రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించని సినిమా థియేటర్లను సీజ్ చేస్తున్నామని అధికారులు అన్నారు.

సినిమా థియేటర్లపై చర్యలు
సినిమా థియేటర్లపై చర్యలు

By

Published : Dec 22, 2021, 4:57 PM IST

Updated : Dec 23, 2021, 7:26 AM IST

రాష్ట్రంలోని సినిమా హాళ్లలో ఉన్నతాధికారుల తనిఖీలతో థియేటర్ల యాజమాన్యాల్లో కలకలం మొదలైంది. జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎస్పీలు, డీఎస్పీలు, తహసీల్దార్ల వరకు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి థియేటర్ల తనిఖీలు చేస్తున్నారు. జీవో 30 ప్రకారం థియేటర్లలో ఉండాల్సిన వసతులు, టికెట్ల ధరలు, క్యాంటీన్‌లో విక్రయించే తినుబండారాల ధరలను, థియేటర్ల నిర్వహణకు వివిధ శాఖలు జారీ చేసిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంచినీటి సీసాలను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, నిబంధనలు పాటించలేదని కొన్ని థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

కృష్ణా జిల్లాలో తనిఖీల్లో భాగంగా లోపాలు గుర్తించిన 15 థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులిచ్చారు. వీటిలో 12 థియేటర్లను తాత్కాలికంగా మూసివేయించడం గమనార్హం. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌ కె.మాధవీలత విజయవాడలోని అప్సర, శైలజ థియేటర్లలో వసతులు సక్రమంగా లేవని, మంచినీళ్ల సీసా అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బందరులోని థియేటర్లను తనిఖీ చేశారు. స్థానిక ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు, ఎస్సైలు ఆయా మండలాల పరిధిలోని థియేటర్లను తనిఖీ చేశారు. కూచిపూడి, అవనిగడ్డలో రెండు, చల్లపల్లి, నాగాయలంక, కోడూరులలో థియేటర్లను మూసివేయించారు. తనిఖీల నేపథ్యంలో విజయవాడ మైలవరం, పెనుగంచిప్రోలు, తిరువూరులలో యజమానులే హాళ్లను మూసేశారు. గుంటూరు జిల్లా అధికారులు థియేటర్ల తనిఖీల నిర్వహణలో గమనించాల్సిన అంశాల జాబితాను వీఆర్వో, ఆర్‌ఐలకు పంపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో సినిమా హాళ్ల యజమానులతో డీఎస్పీ సునీల్‌ సమావేశాన్ని నిర్వహించి టికెట్ల అమ్మకాల తీరుపై ఆరా తీశారు. సీసీ కెమెరాల ఏర్పాటు గురించి సూచనలు చేశారు.

అనుమతులు పునరుద్ధరించుకోలేదని..

శ్రీకాకుళం జిల్లా కలెక్టరు శ్రీకేష్‌ బీ లఠ్కర్‌, జేసీ ఎం.విజయ సునీత పలు థియేటర్లను తనిఖీ చేశారు. విజయ సునీత ప్రేక్షకులతోనూ మాట్లాడారు. తినుబండారాల ధరలు పట్టికపై ప్రదర్శించాలని యజమానులకు సూచించారు. ఈ జిల్లాలో సబ్‌ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు డివిజన్ల పరిధిలోని థియేటర్లను తనిఖీ చేసినప్పుడు అనుమతులు పునరుద్ధరించుకోకపోవడం వంటి లోపాలను గుర్తించారు. వీటిని సరిచేసుకోవాలని ఆరు థియేటర్ల వారికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు పునరుద్ధరించేవరకు సినిమాలు ప్రదర్శించవద్దని కాశీబుగ్గలోని భాస్కర రామ థియేటర్‌ యజమానిని ఆదేశించారని తెలిసింది.

అగ్నిమాపక లైసెన్సులు లేవని..

విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల, కొత్తవలసలో కలిపి ఆరు సినిమా థియేటర్లను అధికారులు సీజ్‌ చేశారు. అగ్నిమాపక శాఖ లైసెన్సు లేకపోవడం, అధిక ధరలకు టికెట్ల విక్రయం, ఇతర నిబంధనల ఉల్లంఘన జరిగిందని వీటిని మూసేశారు.

*ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒంగోలులోని రత్నమహల్‌ థియేటర్‌ను మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. టికెట్‌ బుకింగ్‌ రూమ్‌, ధరల పట్టిక, ఆన్‌లైన్‌లో ధరలు పరిశీలించారు. జేసీ వెంకట మురళి గోరంట్ల మల్టీప్లెక్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి.. ధరలపట్టిక, థియేటర్‌ అనుమతి పత్రాలు పరిశీలించారు.

*అనంతపురం నగరంలోని శాంతి థియేటర్‌లో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రేక్షకులకు అవగాహన కలిగేలా టిక్కెట్‌, తినుబండారాల ధరలను ప్రదర్శించాలని యాజమాన్యానికి సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని థియేటర్‌ను ఆర్డీవో తనిఖీ చేశారు.

*రాజమహేంద్రవరంలో కలెక్టర్‌, ముమ్మిడివరంలో జేసీ, కాకినాడలో ఆర్డీవో సినిమా హాళ్లను తనిఖీ చేశారు. టికెట్‌, పార్కింగ్‌, క్యాంటీన్లలోని ధరల గురించి ఆరా తీశారు. చిత్తూరులోని రాఘవ థియేటర్‌ను సబ్‌ కలెక్టర్‌ పరిశీలించారు.

ఏలూరులో థియేటర్‌ యజమానికి రూ.2 లక్షల జరిమానా!

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని రెండు థియేటర్లలో అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో ఆర్డీవో, తహసీల్దార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఓ థియేటర్‌ వారికి రూ. రెండు లక్షల వరకు జరిమానా విధించారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. జిల్లా జేసీ అంబేడ్కర్‌ మాట్లాడుతూ మూడు డివిజన్లలో తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న థియేటర్లను సీజ్‌ చేస్తామని తెలిపారు.
్య విశాఖ జిల్లాలోని పాయకరావుపేట, చోడవరం, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం సినిమాహాళ్లలో అధిక ధరలకు టికెట్లు విక్రయించారని నాలుగు రోజుల కిందటే షోకాజ్‌ నోటీసులిచ్చారు. తాజాగా చోడవరం, పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి పరిధిలో 18 సినిమా హాళ్లను తహసీల్దార్లు తనిఖీలు చేశారు. థియేటర్ల పొడవు, వెడల్పులను కొలతలు వేసి నమోదు చేసుకున్నారు.

ఆ రేట్లు పెడితే కరెంటు బిల్లూ కట్టలేం: యాజమాన్యాలు

ధికారుల తనిఖీలతో సినిమా హాళ్ల యజమానుల్లో అలజడి మొదలైంది. అధికారులిచ్చే నోటీసులను బట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని థియేటర్ల యజమానులు విజయవాడలో గురువారం సమావేశం కాబోతున్నారు. ‘థియేటర్‌ తెరవకున్నా భారీగా కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తోంది. ఒక్కో థియేటర్‌ నిర్వహణకు దానిలోని స్క్రీన్‌లను బట్టి రూ.3 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు నిర్వహణ ఖర్చు వస్తుంది. కరెంటు బిల్లే నెలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. జీవో 31 ప్రకారం టికెట రేట్లు పెట్టి అమ్మితే కనీసం కరెంటు బిల్లుల డబ్బు కూడా గిట్టుబాటవదు. కొవిడ్‌ అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి థియేటర్లు పుంజుకునే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులకు గురిచేయడం తగదు’ అని పలువురు సినిమా హాళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 23, 2021, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details