ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tenders to roads repairs: వర్షాలు తగ్గాక రహదారుల పనులు చేస్తాం.. బిల్లులు చెల్లిస్తాం! - రహదారుల టెండర్లు వార్తలు

రహదారుల మరమ్మతులకు.. రవాణా, ఆర్‌అండ్‌బీ చర్యలు తీసుకుంటోంది. వర్షాలు తగ్గాక పునరుద్ధరణ పనులు చేసేందుకు.. టెండర్లను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,140 పనులుండగా.. ఇప్పటికే 403 పనులను గుత్తేదారులకు అప్పగించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం అవుతుందనే భావనలో గుత్తేదారులు ఉన్నారని.. వాటిని దూరం చేస్తామని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి అన్నారు.

r and b departments  inviting road tenders
రహదారుల టెండర్లు

By

Published : Jul 27, 2021, 9:05 AM IST

బిల్లుల చెల్లింపులో జాప్యమవుతోందనే భావనలో గుత్తేదారులు ఉన్నారని, వారిలో నమ్మకం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వర్షవిరామ సమయంలోనూ, వచ్చే డిసెంబరు నుంచి మార్చిలోపు మొత్తం 9 వేల కి.మీ.ల రహదారులను పునరుద్ధరణ (రెన్యువల్స్‌) చేస్తామని విజయవాడలో చెప్పారు.

‘రోడ్ల పునరుద్ధరణకు రూ.2 వేల కోట్లను ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని ఆర్థిక శాఖ సూచించగా, అవి ముందుకు రాలేదు. దీంతో అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులతో సంప్రదించగా, మూడు బ్యాంకులు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. నెలాఖరుకు రుణం మంజూరయ్యే వీలుంది. ఈ చెల్లింపులు కూడా నేరుగా బ్యాంకుల నుంచి జరిగేలా ఉత్తర్వులు ఇవ్వడంతో.. గుత్తేదారులు పనులు చేపడతారని ఆశిస్తున్నాం. మొత్తం 1,140 పనుల్లో, ఇప్పటికి 403 పనులను గుత్తేదారులకు అప్పగించాం. మిగిలినవాటికి టెండర్లు పిలుస్తున్నాం. ఆర్‌అండ్‌బీ స్థలాలు, భవనాలు వంటివి కలిపి రూ.4 వేల కోట్ల ఆస్తులుండగా వీటిని ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థకు బదలాయించేలా ప్రతిపాదన పంపాం. రాష్ట్ర రహదారులపై టోల్‌ వసూలుకు సంబంధించి ప్రస్తుతం ప్రతిపాదన లేదు’ - ఎంటీ కృష్ణబాబు, రవాణా - ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి

రూ.388 కోట్ల బకాయిలు

నిరుడు దెబ్బతిన్న రహదారుల్లో అత్యవసర మరమ్మతుల కింద చేసిన పనులకు రూ.388 కోట్ల బిల్లులను త్వరలో మంజూరు చేస్తామని ఆర్థికశాఖ హామీ ఇచ్చినట్లు కృష్ణబాబు తెలిపారు. ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు ప్రాజెక్టులో తొలిదశ కింద రూ.2,970 కోట్ల పనుకు సంబంధించి.. నిధుల విడుదల కోసం ప్రత్యేక ఖాతా తెరిచేందుకు సీఎం సూత్రప్రాయంగా అంగీకరించారు. పెట్రోలు, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున వసూలు చేస్తున్న రహదారి పన్ను ద్వారా ఏటా రూ.600 కోట్లు వస్తుండగా, 15 ఏళ్లపాటు బ్యాంకు రుణం చెల్లించేందుకు దీనిని వినియోగిస్తాం. గత ఏడాది బడ్జెట్‌లో రహదారుల నిర్వహణకు రూ.220 కోట్లు కేటాయించి, తర్వాత రూ.932 కోట్లకు పెంచారు. నిరుడు రూ.600 కోట్లు గుత్తేదారులకు చెల్లించాం. 2014-19 మధ్య కాలంలో ఏటా బడ్జెట్‌లో కేవలం రూ.600 కోట్లే కేటాయించడంతో, పునరుద్ధరణ చేయాల్సిన రహదారులు ఎక్కువగా ఉండిపోయాయి' అని కృష్ణబాబు వివరించారు.

ఇదీ చూడండి:

POLAVARAM: 'చస్తేనే పరిహారం ఇస్తారా.. పోలవరం నిర్వాసితులను పట్టించుకోరా?'

ABOUT THE AUTHOR

...view details