సీఎం జగన్‌కు షాక్.. గుడివాడలో నల్లబెలూన్లతో మహిళల నిరసన Protest Against CM Jagan: గుడివాడలో టిడ్కో గృహాల పంపిణీకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు నిరసన సెగ తగిలింది. సీఎం హెలికాప్టర్ దిగుతుండగా.. ఆ సమీపంలో మహిళలు గాలిలోకి నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. టిడ్కో లబ్ధిదారులను తొలగించడంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలంటూ వారు నినాదాలు చేశారు. గతంలో ఎంపిక చేసిన 1600 మంది లబ్ధిదారులను తొలగించి కొత్తవారికి ఇళ్లను కేటాయిస్తున్నారని బాధితులు వాపోయారు. మౌలిక వసతులు లేకుండా ఇళ్లను ప్రారంభించి వెళ్లిపోతే వాటిలో నివాసం ఎలా ఉండాలంటూ ప్రశ్నించారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలను ముందుగానే అరెస్ట్‌లు చేయగా.. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని మహిళలు టిడ్కో ప్రాంగణంలోని హెలిపాడ్ సమీపానికి వచ్చి నల్ల బెలూన్లు ఎగురవేశారు.
చలో గుడివాడకు పిలుపునిచ్చిన సీపీఐ: ఎన్టీఆర్ జిల్లాలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను వెంటనే కేటాయించాలంటూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా చలో గుడివాడకు సీపీఐ పిలుపునిచ్చింది. ఈ రోజు ఉదయం సీపీఐ కార్యాలయం నుంచి గుడివాడకు వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా సీపీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎన్టీఆర్ జిల్లాతో పాటు విజయవాడ నగరంలో వేలాది మంది టిడ్కో లబ్ధిదారులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు.
గుడివాడ, మంగళగిరి ప్రజలు చేసిన పుణ్యం ఏమిటి.. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు చేసిన పాపం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లాలో టిడ్కో లబ్ధిదారులు తమ ఇళ్ల కోసం నాలుగు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారన్నారు. గుడివాడలో ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమని అడ్డుకోవటం సరైనది కాదన్నారు. విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు సీపీఐ నాయకులను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. గుడివాడలో రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లపై ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కోటేశ్వరరావు స్పష్టం చేశారు.
జగన్ ఓ స్టిక్కర్ సీఎం: చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లకు జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్సీపీ రంగులు వేసి క్రెడిట్ కొట్టేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రం మొత్తం ఇదే నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో ఏం నడుస్తోందో నాలుగేళ్లుగా అదే అన్ని చోట్లా నడుస్తోందన్నారు. జగన్ ఓ స్టిక్కర్ సీఎం అని లోకేశ్ విమర్శించారు.
చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లను సీఎం జగన్ ఎలా ప్రారంభిస్తాడు: సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లు ప్రారంభించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లను జగన్మోహన్ రెడ్డి తన బాబు సొమ్ముతో కట్టించినట్టు ఎలా చెప్పుకుంటాడని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లపై ఉన్న రుణాల్ని చెల్లించకుండా, లబ్ధిదారులకు ఇళ్లు ఇస్తే రేపు బ్యాంకులు వారికి నోటీసులిస్తే, జగన్ సమాధానం చెబుతాడా అంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించడానికి తెలుగుదేశం కార్యకర్తలు చాలని తెలిపారు. హరిహరాదులు వచ్చినా నాని ఓటమిని ఆపలేరని స్పష్టం చేశారు.