ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నిర్ధారణ కోసం వెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

కరోనా పరీక్షల్లో తెలంగాణ హైదరాబాద్​లో పలు ప్రైవేటు ల్యాబ్‌లు నమూనాల సేకరణలో జాగ్రత్తలు పాటించడం లేదు. కనీస సౌకర్యాలు.. అవసరమైన సిబ్బంది లేకుండానే పరీక్షలు చేస్తున్నాయి. వేరే ల్యాబ్‌ల నుంచి టెక్నీషియన్లను తీసుకొచ్చి నమూనాలు సేకరిస్తున్నాయి. రుసుములు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు.

corona tests private labs in hyderabad
హైదరాబాద్​లో‌ కరోనా ప్రైవేటు ల్యాబ్‌లు

By

Published : Jun 17, 2020, 1:06 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి కరోనా నిర్ధారణ పరీక్ష కోసం నగర శివారులోని ఓ ప్రైవేటు ప్రయోగశాలకు వెళ్లాడు. ఓ అపార్టుమెంట్‌లో నడుస్తున్న ఆ కేంద్రంలో పరీక్ష కోసం రూ.4,500 కట్టించుకున్నారు. 10-20 నిమిషాల్లోపు నమూనాలు సేకరిస్తామని సిబ్బంది తెలిపారు. రెండు గంటలు దాటినా పట్టించుకోలేదు. సాయంత్రం ఆరున్నర తర్వాత టెక్నీషియన్‌ బయట నుంచి మోటారుసైకిల్‌పై వచ్చాడు. కనీసం చేతులు శుభ్రం చేసుకోకుండానే పని ప్రారంభించాడు. అతను తీసుకొచ్చిన స్వాబ్స్‌ సైతం అప్పటికే తెరిచి ఉన్నాయి. నమూనాలు సేకరించినట్లు కనీసం రసీదు కూడా ఇవ్వలేదు.

కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల విషయంలో ప్రైవేటు ప్రయోగశాలలు కొన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కనీస సౌకర్యాలు.. అవసరమైన సిబ్బంది లేకుండానే పరీక్షలు చేస్తున్నాయి. వేరే ల్యాబ్‌ల నుంచి టెక్నీషియన్లను తీసుకొచ్చి నమూనాలు సేకరిస్తున్నాయి. తెలంగాణ హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లోని 30 నియోజకవర్గాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ప్రయోగశాలలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా కొంతమంది అడ్డంగా దోచుకుంటున్నారు. కనీసం జాగ్రత్తలు పాటించకుండా నమూనాలు సేకరిస్తున్నాయి.

తగ్గని ధరలు..

కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష ధరను ప్రభుత్వం రూ.2,200గా నిర్ణయించింది. ప్రైవేటు ల్యాబ్‌లు రూ.4500 వసూలు చేస్తున్నాయి. పరీక్షలు సజావుగా నిర్వహిస్తారని ప్రైవేటు బాట పడితే జేబులు గుల్ల అవుతున్నాయి. పరీక్ష అనంతరం ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికంగా వసూలు చేస్తుండటంతోనే రసీదులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. పరీక్ష ఫలితాలు నేరుగా వాట్సాప్‌ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ రసీదు లేకపోవడం, ప్రత్యేక నంబరు ఇవ్వకపోవడంతో ఫలితం తమదేనా? కాదా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షలు ప్రారంభం

జీహెచ్‌ఎంసీతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 50 వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా, ఏరియా ఆసుపత్రులతోపాటు ప్రైవేటు ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. మలక్‌పేట, నాంపల్లి, రామంతాపూర్‌, కూకట్‌పల్లి, బర్కస్‌తోపాటు మల్కాజిగిరి, కొండాపూర్‌ జిల్లా ఆసుపత్రుల్లోనూ పరీక్షలు ప్రారంభించారు.

నిబంధనలు ఇలా..

నమూనాలు సేకరించే వ్యక్తి తప్పనిసరిగా పీపీఈ కిట్‌ ధరించాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్‌ ఛాంబర్‌ నుంచి నమూనాలు తీసుకోవాలి. స్వాబ్‌ పరికరాలను ఒక్కరికే వినియోగించాలి. ల్యాబ్‌ సిబ్బంది సైతం బయటకు వెళ్లి వస్తే తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే పని ప్రారంభించాలి. ఇవేమీ ప్రైవేటు ల్యాబ్‌లు పాటించడం లేదు. ఒకే టెక్నీషియన్‌ వేర్వేరు ప్రయోగశాలల్లో పనిచేస్తున్నారు. దీంతో వేర్వేరు చోట్లకు తిరిగి.. కనీస జాగ్రత్తలు పాటించకుండా నమూనాలు సేకరిస్తున్నారు. స్వాబ్‌ తీసుకునేందుకు వినియోగించేవి శుభ్రంగా ఉండటం లేదని, అప్పటికే వాడినట్లుగా ఉంటున్నాయని పరీక్షల కోసం వెళ్లిన పలువురు వాపోతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వెళ్తే కొవిడ్‌-19 సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABOUT THE AUTHOR

...view details