కృష్ణాజిల్లా విజయవాడలోని కొన్ని ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు కరోనాను ఖాతరు చేయకుండా నేరుగా సీట్ల భర్తీకి చర్యలు చేపట్టారు. నేరుగా కళాశాలలకే విద్యార్థులు, తల్లిదండ్రులను రప్పిస్తూ ప్రవేశాలు జరుపుతున్నారు. తాజాగా కొన్ని కళాశాలలు సీట్లను సైతం భర్తీ చేసుకున్నాయి. ఒకరిని చూసి మరొకరన్నట్టుగా.. ప్రస్తుతం మిగతా కళాశాలలు తమ సీట్లను నింపే పనిని ఆరంభించాయి.
ఇంజినీరింగ్ కళాశాలలతో పోటీపడి సీట్లను భర్తీ చేసుకోవడం డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు ఏటా కష్టతరంగా మారుతోంది. చాలా కళాశాలల్లో కనీస స్థాయిలోనూ సీట్లు నిండటం లేదు. ఈ ఏడాది కరోనాతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. కళాశాలలు తెరిచినా విద్యార్థులు ఎంతమంది వస్తారో కూడా తెలియని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి.
అందుకే.. ప్రస్తుతం సీట్ల భర్తీపై యాజమాన్యాలు దృష్టిసారించాయి. నిన్నమొన్నటి వరకు ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్ కళాశాలలు తమ సీట్ల భర్తీ ప్రయత్నాలు ముమ్మరంగా చేశాయి. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను సైతం ఆరంభించాయి.
- తల్లిదండ్రుల్లో మొదలైన ఆందోళన..
జిల్లాలోని ప్రభుత్వ, కొన్ని ప్రధాన కళాశాలలు ప్రవేశాలను నిర్వహించటం లేదు. దీంతో వాటిలో చేరాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. కొన్ని కళాశాలలు ప్రవేశాలు జరపటం, వాటిలో విద్యార్థులు చేరిపోతుండటంతో తమ పిల్లల పరిస్థితి ఏంటనే ఆందోళన ప్రధానంగా తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.