Price Rise of Essential Commodities: 'ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగన్నా.. ధరలు మీద ధరలు పెరిగె నాగులో నాగన్న' అనే ఆర్. నారాయణమూర్తి సినిమాలో పాట ఎంత మందికి గుర్తుంది. ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు అలాగే మారాయి. పప్పులు, ఉప్పు, వంటనూనె వంటి ధరలు ఆకాశానికి పరుగులు పెడుతుండడంతో ప్రజలు బతుకెళ్లదీయలేక పడుతున్న పాట్లు అన్నీఇన్నీ.. కాదు. ఇలా గ్రామాల్లో ఉపాధిలేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
ప్రజల సమస్యలు ఇలా ఉంటే వ్యాపారులు బాధలు మరోలా ఉన్నాయి. ఏ రోజుకి ఏ ధర ఉంటుందో తెలియట్లేదని, ఒకేసారి ఎక్కువ మోతాదులో సరుకులు కొనుగోలు చేస్తే.. ఒకవేళ వాటి ధరలు తగ్గితే తాము నష్టపోతామనే భయంలో ఉన్నామని చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేసే సరుకులు మోతాదు తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తమ వ్యాపారాలు దెబ్బుతింటున్నాయని వాపోతున్నారు.
రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికితోడు నిత్యావసరాల ధరలు నెలల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. దీంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూలీ పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే.. పప్పు, ఉప్పు, వంటనూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాము ఏమి తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు.