పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల అంశంపై వాదన వినిపించేందుకు జలవనరులశాఖ సిద్ధమవుతోంది. నవంబరు 2న హైదరాబాద్లో జరిగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశంలో రాష్ట్రం తరఫున గట్టిగా వాణి వినిపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. రూ. 55,548 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్టుగా... పార్లమెంటులో జలశక్తి శాఖ ప్రకటించిన అంశాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్దాస్ సహా పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
అంచనాలపై వాదనలు వినిపించేందుకు అధికారుల కసరత్తు - Polavaram Project latest news
నవంబర్ రెండున హైదరాబాద్లో జరిగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపే విధంగా తమ వాణిని వినిపించాలని నిర్ణయించారు. మరో వైపు 2013-14లోని అంచనా ప్రకారమే డబ్బు చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది.
![అంచనాలపై వాదనలు వినిపించేందుకు అధికారుల కసరత్తు preparing of officers to hear arguments on Polavaram estimates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9371813-542-9371813-1604071254165.jpg)
2014 నాటికి ఉన్న ప్రాజెక్టు పనుల అంచనాను 2017-18 షెడ్యూల్డ్ స్టాండర్డ్ రేట్ ప్రకారం రూ.55,548 కోట్లుగా జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించింది. అయితే ఈ అంచనాలను జలశక్తి శాఖ సమీక్షించి రూ.47,725.74 కోట్లుగా తేల్చింది. ఈ మొత్తాన్ని ఆమోదించాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖకు నివేదిక పంపారు. దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ 2013-14లోని అంచనా ప్రకారం రూ. 20,398.61 కోట్లనే చెల్లిస్తామని స్పష్టం చేసింది. దీన్ని నిర్ధారించాలంటూ పీపీఏకు సమాచారం అందించింది. ఈ పరిస్థితుల్లో నవంబరు రెండున జరిగే సమావేశంలో అంచనా విలువను సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
ఇదీచదవండి.