రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తోన్న నిరవధిక నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. గుణదలలోని విద్యుత్తు సౌధ వద్ద ఆందోళనకు యత్నించిన వారిలో 15 మందిని పోలీసులు నిర్బంధించి అజ్ఞాత ప్రదేశానికి తీసుకెళ్లారని ఐకాస నేతలు ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయకపోతే మరింత ఉద్ధృతంగా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరించే విధానాలను ఉసంహరించుకోవాలని నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2020ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. వీటీపీఎస్, ఆర్టీపీపీల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కోరారు. కొవిడ్ బారినపడి మరణించిన ఉద్యోగులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాకుండా సీఎండీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.