POULTRY INDUSTRIES PROBLEMS : కోడిగుడ్డుకు సరైన ధర లభించక రాష్ట్రంలోని కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. గతంలో నెక్ సంస్థ నిర్ణయించిన ధర ఆధారంగా కోడిగుడ్లను విక్రయించేవారు. ఆ సంస్థ కోళ్ల పరిశ్రమ నిర్వహణకు అవుతోన్న ఖర్చు, పెట్టుబడి, మార్కెట్ పరిస్థితిని అంచనా వేసి గుడ్డుకు కనీస ధర నిర్ణయించేది. దాంతో అటు వినియోగదారులకు ఇటు నిర్వాహకులకు ఇబ్బంది లేకుండా ఉండేది.
ఐతే మూడేళ్ల నుంచి నెక్ నిర్ణయించిన ధరకు కాకుండా.. వేరే ధరకు విక్రయించాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో రాష్ట్రం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లి అనేక మంది ఫౌల్ట్రీ వ్యాపారం చేసేవారంటున్న నిర్వాహకులు.. అక్కడి ప్రభుత్వాలతో పాటు స్థానిక వ్యాపారుల నిర్ణయాలతో క్రమంగా అక్కడ మనలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఫలింతంగా మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేసి రాష్ట్రంలోనే పరిశ్రమలను నిర్వహించడం ప్రారంభించారని వివరిస్తున్నారు.
తర్వాత ఉత్తరాది రాష్ట్రాల నుంచి అనేక మంది ట్రేడర్స్ ఏపీకి వచ్చి వ్యాపారం చేస్తున్నారని.... ఫలితంగా వారి సంఖ్య పెరిగి మనవాళ్ల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఉత్తరాది ట్రేడర్స్ గుత్తాధిపత్యం చెలాయిస్తూ నెక్ నిర్ణయించిన ధర కన్నా తక్కువకు గుడ్లు విక్రయించాలని అడుగుతున్నారని... దానివల్ల స్థానికంగా కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు.