కరోనాతో కోళ్ల పరిశ్రమ విలవిల రాష్ట్రంలో కోళ్లపరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోంది. కరోనా గురించి జరుగుతున్న ప్రచారం కోళ్ల పరిశ్రమను దారుణంగా దెబ్బతీసింది. ఫిబ్రవరి ప్రారంభం నుంచి మొదలైన కలకలం క్రమంగా విస్తరించడం వల్ల చికెన్ కొనుగోళ్లు పడిపోయాయి.
ఫలితంగా కోడిపిల్లల ఉత్పత్తి నిలిపివేసి గుడ్లను తక్కువ ధరకు అమ్మాల్సిన దుస్థితి నెలకొంది. మునుపెన్నడూ లేని విధంగా చికెన్ ధరలు పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. బర్డ్ ప్ల్యూ, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు నష్టం వాటిల్లినా ఇంత దారుణంగా ఎప్పుడూ లేదని వాపోతున్నారు.
పౌల్ట్రీ రంగం దెబ్బతినడం వల్ల కోళ్లమేతకు ఉపయోగించే మొక్కజొన్న, జొన్న తవుడు, నూకలపై ఈ ప్రభావం పడుతోంది. గతేడాది ధరలతో పోల్చితే..ఈసారి ధరలు బాగా తగ్గవచ్చని భావిస్తున్నారు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మార్కెట్‌లో మళ్లీ చికెన్, గుడ్లు అందుబాటులోకి రావడానికి ఆరు నెలల సమయం పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం కోళ్ల పెంపకాన్ని ఆపివేస్తున్నందున ఈ పరిస్థితి ఏర్పడుతుందని వారు విశ్లేషిస్తున్నారు. కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు కాలం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తోడ్పాటునందించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి :కరోనా కాలం.. స్వచ్ఛంద సంస్థల మానవత్వం